అతి తక్కువ సమయంలో వంద సినిమాలు తీయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అందుకే వాసి పై కంటే రాసిపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇటీవల వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ సంస్థకు పెద్ద దెబ్బ. బాక్సాఫీసు దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది సినిమా. రివ్యూలు ‘బచ్చన్’ని ఏకి పడేశాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాకీ రానంత నెగిటివిటీ ‘బచ్చన్’ మూటగట్టుకొంది. దీనిపై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పోస్ట్ మార్టమ్‌కు దిగారు. సినిమా మరీ అంత బ్యాడ్ గా ఏం లేదని, ఫస్టాఫ్ బాగుందని, పాటలు నచ్చాయని, సెకండాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పిందని, దానికి తోడు హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ల వల్ల మరింత డామేజీ జరిగిందని ఈ ఫ్లాపు కారణాల్ని ఏకరువు పెట్టారు. సినిమాలో విషయం ఉంటే తాము పోరాడేవాళ్లమని, అయితే ఆ అవకాశం లేకుండా పోయిందని ఇప్పుడు వాపోతున్నారు.
సినిమా హిట్టూ, ఫ్లాపూ ప్రధానం కాదు. అవి వస్తుంటాయ్, పోతుంటాయి. కానీ ఆటిట్యూడ్ చాలా ముఖ్యం. విడుదలకు ముందు ఏం మాట్లాడుతున్నారు? ఏ స్థాయిలో సినిమాని మోస్తున్నారు అనేది ప్రేక్షకులు గమనిస్తుంటారు. ‘మిస్టర్ బచ్చన్’కు ముందు హరీష్ కావల్సినదానికంటే కాస్త ఎక్కువే మాట్లాడాడు. అన్నింటికంటే ఓ వెబ్ సైట్ కు కావాలని, పనిగట్టుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా మిస్ ఫైర్ అయ్యింది. ఫ్లాప్ అనే టాక్ వచ్చిన తరవాత కూడా ఫ్యాన్స్ మీట్ పెట్టి, వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకొంటూ పోయాడు. ఆ ఇంటర్వ్యూ ప్రమోషన్లకు ప్లస్ అవ్వకపోగా, మైనస్ అయ్యింది. టి.జి.విశ్వప్రసాద్ బాధ కూడా ఇదే. కావల్సినదానికంటే ఎక్కువ డామేజీ జరగడానికి కారణం ఈ రకమైన పబ్లిసిటీనే అన్నది ఆయన ఫీలింగ్. ఓరకంగా ఈ ఫ్లాపు భారం హరీష్ శంకర్‌పై వేసేసినట్టే.
ఈ సంస్థ నుంచి వచ్చిన ‘మనమే’ కూడా బాక్సాఫీసు దగ్గర పరాజయం పొందింది. అయితే కమర్షియల్ గా ఆ సినిమా వల్ల లాభపడేవాళ్లమని ఓ చీటర్ వల్ల భారీగా నష్టాలొచ్చాయని షాకింగ్ కామెంట్స్ చేశారు విశ్వప్రసాద్. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మోసపోయామని, థర్డ్ పార్టీ చేతుల్లో ఆ హక్కులు ఉండిపోయాయని, వాటిని తాము అమ్మలేక, ఆ వ్యక్తీ అమ్మక మొత్తం బడ్జెట్ లో 60 శాతం వరకూ అక్కడే ఇరుక్కుపోయాయని, ఈ విషయంలో తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్. ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్‌పై ‘మనమే’ నష్టాలపై విశ్వ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి.