రన్ టైమ్ విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తగా ఉంటోంది. సినిమా ఎంత బాగున్నా, లెంగ్త్ ఎక్కువైతే ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. అందుకే ఎడిటింగ్ రూమ్‌లోనే వీలైనంత ట్రిమ్ చేయడానికి చూస్తున్నారు. దాదాపుగా ప్రతీ సినిమా 2 గంటల 20 నిమిషాల్లోనే ముగుస్తోంది. అయితే అప్పుడప్పుడూ లెంగ్తీ చిత్రాలూ వస్తున్నాయి. ఈవారం విడుదల కానున్న ‘సరిపోదా శనివారం’ కూడా లెంగ్తీ సినిమానే. ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. మొత్తం రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు. అందులో 4 నిమిషాలు టైటిల్ కార్డ్స్ కి వెళ్లిపోయినా 2 గంటల 46 నిమిషాల సినిమా ఇది. ఓరకంగా రన్ టైమ్ ఎక్కువే. కానీ సినిమాపై నమ్మకంతో అలానే వదిలేస్తున్నారు.
నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. సూర్య ప్రతినాయకుడు. నాని – సూర్యలపై తెరకెక్కించిన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది. వారిద్దరి కెమిస్ట్రీ ‘సరిపోదా..’ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లబోతోందని టాక్. సోకులపాలెం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలపై చిత్రబృందం ఎక్కువ భరోసా పెట్టుకొంది. నాని ప్రమోషన్లపై విపరీతంగా దృష్టి పెడుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న సినిమా కాబట్టి, అన్ని చోట్లా తానే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రమోషనల్ సాంగ్ రూపొందించారు. దాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.