ఆన్ లైన్ ఫ్రాడ్స్టర్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకునేవారు కొందరయితే… రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడి జీవితాంతం సంపాదించుకున్నదంతా పోగొట్టుకునేవారు మరికొందరు. సొంత ఇల్లు ఎవరికైనా కలే. ఆ కలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్లో గత కొద్ది కాలంలోనే ఇలా ప్రజలు రూ. పది వేల కోట్ల వరకూ మోసపోయారు.
ప్రిలాంచ్ ఆఫర్ల పేరుతో అనేక కంపెనీలు భారీగా ప్రచారం చేసుకుని ముందుగానే డబ్బులు వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేశాయి. కేసేలు పెడితే కొంత కాలం జైల్లో ఉండి బయటకు వస్తున్నారు. ఇక ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. సాహితీ ఇన్ ఫ్రా అనే వైసీపీ నేతకు చెందిన సంస్థ హైదరాబాద్లో రెండున్నర కోట్ల వరకూ వసూలు చేసింది. ఆ బాధితులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
భువనతేజ, జేజే ఇన్ ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి మొత్తానికే మోసం చేసిన సంస్థలు ఉన్నాయి. అలాగే చిన్నా చితకా సంస్థలు.. బిల్డర్లు కూడా తక్కువ ధరకు ఇళ్లను ఆశ చూపి.. పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు. తర్వాత పత్తా లేకుండాపోయారు. వీరు లూటీ చేసిన సొమ్ము పది వేల కోట్లను నిజంగానే వారి వారికి ఇళ్లు కట్టించి ఉంటే… ఎంతో మంది సొంత ఇంటి కలను నెరవేర్చుకునేవారు.
నిజానికి ఇలాంటి మోసాలకు వ్యవస్థల సహకారం ఉంటోందనేది బహిరంగసత్యం. రెగ్యులేటరీ సంస్థలు ఉన్నా వారిని కట్టడి చేయలేకపోయారు. ప్రజలు కూడా ఆశపడటంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఊరూ పేరూ లేని సంస్థల ప్రిలాంచ్ ఆఫర్లను నమ్మకపోవడమే మంచిది.