సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు ఉండబోతున్నాయని ఇటీవల ప్రచారం జరిగినా.. ఇది నాగార్జునది కావడంతో హైడ్రా ఆ పని చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ హైడ్రా.. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి నాగార్జునకు షాక్ ఇచ్చింది.
అయితే , ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణంగా తెలుస్తోంది. మాదాపూర్ లో తుమ్మిడి చెరువును ఆనుకోని నాగార్జున ఈ నిర్మాణం చేపట్టారని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసినట్లుగా సమాచారం. ఎఫ్ టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా కన్వెన్షన్ ను నిర్మించారని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రాకు శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను కోమటిరెడ్డి ఇవ్వడంతో.. ఈ లేఖపై విచారణ జరిపి హైడ్రా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హౌజ్ వ్యవహారంలో కోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది. కూల్చివేతలకు ముందుగా డాక్యుమెంట్ల పరిశీలించాలని ఆదేశించడంతో.. ఎన్ కన్వెన్షన్ పై డాక్యుమెంట్లను పరిశీలించే కూల్చివేతలు చేపట్టినట్లుగా స్పష్టం అవుతోంది.