సినీ హీరో అక్కినేని నాగర్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఎట్టకేలకు కూల్చివేశారు. కన్వెన్షన్ సెంటర్ చెరువును ఆక్రమించి కట్టారు అని పార్టీలన్నీ విమర్శించినవే. కానీ అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారు. కానీ, ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతుండటంతో, ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై కూడా ఫిర్యాదులు రావటంతో… కూల్చివేశారు.
అయితే, ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తిరిగి నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం విస్తీర్ణం 10ఎకరాల పైమాటే. అందులో ఇప్పుడు చెరువు ఆక్రమించిన విస్తీర్ణం మూడున్నర ఎకరాల వరకు ఉంటుంది.ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్లు అన్నీ పోను ఇంకా కనీసం 7 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది.
ఈ మొత్తం స్థలం అక్కినేని నాగర్జునతో పాటు మరో వ్యక్తి పేరుతో ఉంది. దీంతో మిగిలిన స్థలంలోనే కొత్త ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను, మరింత హంగులతో నిర్మించే అవకాశం ఉంది.
అక్రమ నిర్మాణాలను కూల్చటం ద్వారా ప్రభుత్వం గట్టి మెసెజ్ పంపినట్లు అయ్యింది. రాజకీయ ఒత్తిళ్లు ఏమాత్రం పనిచేయవని.. సెలబ్రిటీలు అయినా, రాజకీయ నాయకులు అయినా, ఇంకా ఎవరైనా సరే… చెరువుల ఆక్రమణల విషయంలో రేవంత్ సర్కార్ వెనుకడుగు వేయదు అంటూ మంత్రులు స్పందిస్తున్నారు.
ఇప్పటికే కేటీఆర్ సవాల్ కు పొంగులేటి ప్రతి సవాల్ విసరటం, ఇప్పుడు సెలబ్రిటీ అయినా ఆక్రమణలు కూల్చిన నేపథ్యంలో… హైడ్రా దూకుడు కంటిన్యూ చేయాలన్న స్పందన వస్తోంది.