తొలి సినిమాకే హిట్టు కొట్టిన దర్శకుడతను. కాబట్టి… పెద్ద హీరోల ఫోకస్ ఆటోమెటిగ్గా పడుతుంది. అలానే.. రెండో సినిమాకే స్టార్ తో పని చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాడు. ప్రాజెక్ట్ ఆన్ అయ్యింది. అయితే అక్కడి నుంచి ఆ దర్శకుడికి కష్టాలు మొదలయ్యాయి. ఆ హీరోకి కథ చెప్పి, ఒప్పించడం తేలికే. కానీ ఆ తరవాత హీరోగారు స్క్రిప్టులో రంగ ప్రవేశం చేస్తారు. ‘ఈ సీన్ ఇలాక్కాదు.. అలా’ అంటూ మార్పుల పర్వం మొదలవుతుంది. హీరోగారి సీనియారిటీ తెలుసుకాబట్టి దానికీ ఆ దర్శకుడు ప్రిపేర్ అయిపోయాడు.
అయితే అదే సినిమాకు ఓస్టార్ కెమెరామెన్ ని తీసుకొచ్చారు. ఆయన కూడా హీరో టైపే. దర్శకుడికి సలహాలూ సూచనలు ఇవ్వడం మొదలెట్టారు. హీరోగారు ఓకే చేసిన సీన్, కెమెరామెన్‌కి నచ్చదు. కెమెరామెన్ వెర్షన్ ఆ దర్శకుడికి అర్థం కాదు. ‘ఇలాక్కాదులే..’ అని ఆ దర్శకుడ్ని పక్కన పెట్టి, ఆ కెమెరామెన్‌నే తీసుకొచ్చి డైరెక్టర్ సీట్లో కూర్చోబెట్టారు. సదరు డైరెక్టర్ సెట్లో ఉంటాడు కానీ, కర్త కర్మ క్రియ అన్నీ.. కెమెరామెనే. హీరోకి ఆ కెమెరామెన్‌కీ మంచి రాపో కూడా ఉంది. అందుకే డైరెక్షన్ పవర్స్ ఈజీగా షిఫ్ట్ అయిపోయాయి. పెద్ద హీరో సినిమాకి పని చేస్తున్నానన్న తృప్తి కూడా సదరు దర్శకుడికి లేకుండా పోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే.. బయటకు చెప్పుకోలేడు. అలాగని లోపల దాచుకోలేడు. ఈ ఫస్ట్రేషన్ అంతా తన సహాయకుల దగ్గర ప్రదర్శిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఆ సినిమా ఏమిటో, దర్శకుడు ఎవరో, కెమెరామెన్ పేరేంటో గెస్ చేయగలరా?