ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ యజమాని , సినీ నటుడు అక్కినేని నాగార్జున హైడ్రా తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున రఘురాం వాదనలు వినిపించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు హైకోర్టు ఆదేశాలను దిక్కరించడమేనన్నారు. గతంలో కన్వెన్షన్ నిర్మాణంపై నోటీసులు ఇవ్వగా హైకోర్టును ఆశ్రయించామని .. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే విధించిందని వాదించారు.
అయినా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా హైడ్రా తాజాగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేతలు చేపట్టిందన్నారు. అనంతరం ఈ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. అప్పటికే కూల్చివేత ప్రక్రియ ముగిసినట్లుగా తెలుస్తోంది.