కమర్షియల్ డైరెక్టర్ అనే ముద్ర పడడం కష్టం. కానీ ఆ తరవాత ప్రయాణం బాగుంటుంది. మాస్ హీరోలంతా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఒకట్రెండు ఫ్లాపులు పడ్డా… బండికి ఢోకా ఉండదు. హరీష్ శంకర్‌పై నిన్నా మొన్నటి వరకూ ఆ ముద్రే ఉండేది. కమర్షియల్ మాస్ మసాలా దినుసులతో సినిమా ఎలా వండాలో తనకు బాగా తెలుసు. రీమేక్ కథని తనదైన స్టైల్లో మార్చి, తెలుగు ప్రేక్షకులకు వడ్డించగలడని బాగా పేరు తెచ్చుకొన్నాడు. అయితే ‘మిస్టర్ బచ్చన్’ అంచనాల్ని తారు మారు చేసింది. ఆగస్టు 15న వచ్చిన ఈ సినిమా ఈ యేడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తయితే, హరీష్‌పై జరిగిన పర్సనల్ డామేజీ మరో ఎత్తు. సోషల్ మీడియాలో హరీష్‌ని దారుణంగా ట్రోల్ చేశారు, చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ మరో హీరోని పట్టుకోవడం, ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం క్లిష్టమైన సమస్యగా మారింది.
‘బచ్చన్’ విడుదలకు ముందే సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకొన్నాడు హరీష్. వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలకు కథలు చెప్పాడు. కానీ కుదర్లేదు. ఆ తరవాత రామ్ దగ్గరకు వెళ్లాడు. రామ్ ‘చేయాలా, వద్దా’ అంటూ ఊగాడు. ‘బచ్చన్’ రిజల్ట్ తో ఇక ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నాడు. నిజానికి రామ్ కూడా ఖాళీగా లేడు. మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ‘ఓకే’ చెప్పాడు. ‘బచ్చన్’ హిట్టయితే ఆ సినిమా పక్కన పెట్టి హరీష్ ప్రాజెక్ట్ ఓకే చేసేవాడు. ఒక వేళ ‘డబుల్ ఇస్మార్ట్’ హిట్ అయినా, ఆ ఊపులో హరీష్‌తో సినిమా చేయడానికి ధైర్యం చేసేవాడు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’దీ ‘మిస్టర్ బచ్చన్’ కథే. దాంతో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ రిస్క్ చేయలేకపోతున్నాడు. రామ్ మినహాయిస్తే యంగ్ హీరోలెవరూ ఖాళీగా లేరు. ఇప్పుడు హరీష్ ముందున్న ఆప్షన్ ఒక్కటే. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా ఎలాగోలా పట్టాలెక్కించాలి. అది పూర్తి చేసి హిట్ కొట్టాలి. కనీసం యావరేజ్ అయినా చేయాలి. అప్పుడు మిగిలిన హీరోలు కాస్త ముందుకొస్తారు. అయితే ‘ఉస్తాద్’ పూర్తవ్వడం కూడా అంత తేలిక కాదు. ‘ఉస్తాద్’ కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయ్యింది. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ పూర్తయితే కానీ ఉస్తాద్ గురించి పవన్ ఆలోచించడు. హరీష్ అప్పటి వరకూ ఖాళీగా ఉండడం మినహా మరో మార్గం లేదు.