ఇసుక జోలికి వెళ్లవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిలక్కి చెప్పినట్లుగా చెబుతున్నారు. కానీ ఆయన మాటల్ని పట్టించుకోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వంటి వారు మాత్రం… చెలరేగిపోతున్నారు. ఇసుక నుంచి తైలం పిండుకునేందుకు పోటీ పడుతున్నారు. మీడియాలో వార్తలు వస్తే.. అంతు చూస్తానని బెదించే స్థాయికి వెళ్లిపోయారు.
టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిల కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి. ఆయనపై నియోజకవర్గ నేతల్లో ఏకాభిప్రాయంలేకపోయినా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అవకాశం కల్పించినా ఆయన ఓడిపోయారు. కానీ ఆయనపై గెలిచిన బియ్యం మధుసూదన్ రెడ్డి మరీ కక్కుర్తి ఎమ్మెల్యే కావడంతో ప్రజలు వెంటనే వదిలించుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డిని గత ఎన్నికల్లో గెలిపించారు. అయితే బొజ్జల సుదీర్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు.
ఇసుక విషయంలో ట్రాక్టర్ కు ఐదు వందల చొప్పున ఆయన అనుచరులు వివిధ గ్రామాల్లో వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ తప్పును దిద్దుకోవాల్సింది పోయి.. వార్తలు రాసిన జర్నలిస్టులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు చేయవద్దని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. కానీ సుధీర్ రెడ్డి మాత్రం అదే బాటలో వెళ్తూండటం.. మీడియాని సైతం బెదిరిస్తూండటంతో ఆయనను దారిలో పెట్టాలన్న సూచనలు పార్టీ హైకమాండ్‌కు వెళ్తున్నాయి.