నిర్మాతలు రెండు రకాలు. ఒకరు… డబ్బులు పెట్టడం వరకే ఆలోచిస్తారు. రెండోరకం మాత్రం కథ దగ్గర్నుంచి, ఫైనల్ కాపీ వచ్చేంత వరకూ ఓ టెక్నీషియన్లా పని చేస్తారు. అయితే చిత్రసీమలో మొదటి రకం నిర్మాతలే ఎక్కువ. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా డబ్బులు పెట్టడం వరకే పరిమితం అవుతారన్న సంగతిని కథానాయకుడు నాని రివీల్ చేసేశారు. నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి దానయ్య నిర్మాత. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దానయ్య కు సంబంధించిన ఈ సీక్రెట్ బయట పెట్టేశారు నాని.
దానయ్యకు ఆయన చేసే సినిమాల కథలేవీ తెలియవని, కానీ సెట్లో వచ్చినప్పుడు మాత్రం కాన్ఫిడెన్స్ గా ఉంటారని, ఆయన పాజిటీవ్ ఆటిట్యూడ్ నచ్చుతుందని అందుకే ఆర్.ఆర్.ఆర్, సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ని వెదుక్కొంటూ వెళ్లాయని నాని ఆసక్తికకమైన కామెంట్లు చేశారు. ఇంతింత పెద్ద సినిమాలు తీసే నిర్మాతకు కథ తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కథ తెలిస్తేనే కదా, బడ్జెట్ పై, ఆ సినిమా చేయగలిగే మార్కెట్ పై ఓ అంచనా వస్తుంది. ఎంత ఖర్చు పెట్టాలో, అది ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. కథే తెలియకపోతే ఆ సినిమాపై నిర్మాతకు జడ్జిమెంట్ ఎలా కుదురుతుంది? అలాంటిది కథే తెలియకుండా ఇంతింత పెద్ద సినిమాలు ఎలా తీస్తున్నారు? ఓరకంగా దానయ్య జడ్జిమెంట్ ని ఇరుకున పెట్టే కామెంట్లు ఇవి.
కాకపోతే దానయ్య టైపు వేరు. ఆయన కాంబినేషన్ని నమ్ముకొనే నిర్మాత. రాజమౌళితో సినిమా సెట్ అయితే చాలు. కథ ఎవరికి కావాలి? అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో దానయ్యకు కథ గురించిన బెంగ అవసరం లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తే చాలనుకొనే రోజులు ఇవి. అలాంటప్పుడు ‘ఓజీ’ కథ గురించి ఆయన ఎందుకు పట్టించుకొంటారు? మార్కెట్ లో ఫామ్లో ఉన్నదెవరు? ఎవరితో సినిమా తీస్తే లాభపడతాం? అనే టెక్నిక్ నిర్మాతకు తెలిస్తే చాలు. అది దానయ్యకు తెలుసు. నాని ఇన్నర్ మీనింగ్ కూడా అదే అయ్యుంటుంది. మరో విషయం ఏమిటంటే దానయ్య కథ గురించి పెద్దగా ఆలోచించరట. ‘మన కథ వింటారా’ అని దర్శకుడు అడిగినా.. ‘వింటాలెండి..’ అంటారు తప్ప, దానిపై పెద్దగా ఫోకస్ చేయరని దానయ్య సన్నిహితులు చెబుతుంటారు. మొత్తానికి కథ వినకుండానే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించే నిర్మాతగా దానయ్య మిగిలిపోతారేమో..?