సహాయ పాత్రల్లో దిట్ట రావు రమేష్. టాలీవుడ్ లోనే అత్యంత బిజీగా ఉండే ఆర్టిస్టుల్లో ఆయనొకరు. ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తారు. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’తో. ఈ సినిమా నుంచి ఆయన ‘ది ఎంటర్టైనర్’ అయ్యారు. ఆయన పేరు ముందు ఈ సినిమాతో ఈ బిరుదు వచ్చి చేరింది. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సుకుమార్ శ్రీమతి తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం, అల్లు అర్జున్, సుకుమార్ ప్రీ రిలీజ్ వేడుకకు రావడం.. పబ్లిసిటీ పరంగా ప్లస్ అయ్యాయి. వసూళ్లు, రివ్యూలు ‘ఓకే’ అనిపించాయి. ముఖ్యంగా రావు రమేష్ కు ఈ సినిమా ప్రత్యేకమైన అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చింది. తను సోలో హీరోగా, ఇలాంటి వెరైటీ క్యారెక్టరైజేషన్లతో సినిమాలు తీస్తే జనం చూస్తారా, చేయగలనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికినట్టైంది. ఇక మీదట యేడాదికి కనీసం రెండు మూడు సినిమాల్లో అయినా ఇలాంటి ప్రయత్నాలు చేయాలని రావు రమేష్ ఫిక్సయ్యారని తెలుస్తోంది.
ఇది వరకు దాసరి నారాయణరావు, విస్సు, గొల్లపూడి మారుతీరావు లాంటి నటులు అప్పుడప్పుడూ ఈ తరహా కథల్ని ఎంచుకొని, సినిమా మొత్తాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకొని నడిపించేవారు. మరుగున పడిపోతున్న కొన్ని కథలు ఇలాంటి నటుల్ని వెలుగులోకి తెచ్చేవారు. ఈతరంలో ఆ తరహా ప్రయోగాలు ఎవరూ చేయడం లేదు. కథలూ రావడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి కథల్ని సినిమాలుగా తెరకెక్కించడం లేదు. రావు రమేష్ ఇప్పుడు ఆ ప్రయత్నానికి పూనుకొంటే కొత్త కథల్ని చూసే అవకాశం ఉంది. ”మధ్యతరగతి అంటే నాకు చాలా ఇష్టం గౌరవం. వాళ్ల జీవితాలపై కామెడీ చేసి కించపరచకూడదు. వాళ్లపై మరింత గౌరవం తీసుకొచ్చేలా లా సినిమాలు ఉండాలి. ‘మారుతి నగర్’ అలాంటి కథే. అందుకు ఇంత మంచి ఆదరణ లభిస్తోంది” అంటున్నారు రావు రమేష్. ఇప్పుడు సందీప్ కిషన్‌తో రావు రమేష్ ఓ సినిమా చేస్తున్నారు. అందులోనూ హీరోతో సమానమైన పాత్రే పోషిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకుడు. త్వరలోనే టైటిల్ ఏమిటన్నది తెలుస్తుంది.