బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ అండ్ కో ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఇటీవల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లారు. కానీ, ఇప్పుడు ఏకంగా 20మంది ఎమ్మెల్యేలతో ఎందుకు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే మార్చి నుండి కవిత జైల్లో ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది కూడా పడుతున్నారు. పైగా ఇదే కేసులో… ఇప్పుడు విచారణ చేపట్టిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా ఇచ్చింది. బెయిల్ ఇచ్చే సందర్భంలో… బెంచ్ చేసిన వ్యాఖ్యలతోనే కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.
దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బెయిల్ ఇచ్చినా, రాకున్నా… 20మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అన్న చర్చ సాగుతోంది. కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఈడీ, సీబీఐ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతున్నా…. మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అని కూడా తెలుస్తోంది.
రుణమాఫీ నుండి ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ విఫలం అయ్యిందని, ఎన్నికల సమయంలో నాది హమీ అంటూ రాహుల్ గాంధీ హమీలు ఇచ్చిన నేపథ్యంలో… రాహుల్ గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన నేతల విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని ఢిల్లీలోనే ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.