నాని లైనప్ మామూలుగా ఉండదు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాల స్క్రిప్టులు రెడీగా ఉంటాయి. ఇద్దరు ముగ్గురు దర్శకులు కథలు వండుతుంటారు. నలుగురు నిర్మాతలు అడ్వాన్సులతో రెడీగా ఉంటారు. ఇప్పటికున్న లైనప్ చూసుకొంటే నాని మరో రెండేళ్లు బిజీ. ఇంత హడావుడిలోనూ మరో దర్శకుడికి నాని మాటిచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. తనే దేవా కట్టా.
‘ప్రస్థానం’ సినిమాతో ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకొన్నాడు దేవాకట్టా. అయితే ఆ తరవాత తన నుంచి సరైన సినిమాలు రాలేదు. కాకపోతే మంచి స్టోరీ టెల్లర్ అనే పేరు మాత్రం తెచ్చుకొన్నాడు. ‘రిపబ్లిక్’ వచ్చి మూడేళ్లయిపోయింది. అప్పటి నుంచీ దేవాకట్టా ఖాళీనే. అయితే ఆయన త్వరలో నానితో ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు దేవాకట్టా హాజరయ్యారు. నానితో సినిమాలు చేస్తున్నవాళ్లు, చేసిన దర్శకులు ఈ వేదికపై కనిపించారు. దేవాకట్టాతో త్వరలోనే నాని సినిమా చేస్తాడని, అందుకే ఈ ఫంక్షన్‌కి ఆయన హాజరయ్యారని ఇన్ సైడ్ వర్గాల టాక్. నానితో సినిమా చేయాలని దేవాకట్టా ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. కొన్ని కథలు కూడా వినిపించారు. కానీ ఎందుకో అవి సెట్ అవ్వలేదు. ఈసారి మాత్రం ఈ కాంబో ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. నాని నిర్మాతగానూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలో పలు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. అయితే దేవా కట్టా సినిమాకు నాని ప్రొడ్యూస్ చేస్తాడా, లేదంటే హీరోగా నటించబోతున్నాడా? అనే విషయాలు మాత్రం తెలియాల్సివుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా దేవా కట్టా తదుపరి చిత్రానికి కాస్త క్రేజ్ వచ్చినట్టే.