వివాదాస్పద ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన అంతర్జాతీయ స్మగ్లర్. గతంలో విదేశాలకు పారిపోతే.. వేటాడి.. వెంటాడి మరీ ఏపీ పోలీసులు పట్టుకొచ్చి జైల్లో వేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు సులువుగా బెయిల్ వచ్చింది. తర్వాత నాలుగేళ్ల పాటు ఇష్టారాజ్యంగా కడపలో రాజకీయాలు, వ్యాపారం చేశారు. వైసీపీ ఓడిపోవడంతో ఇప్పుడు మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన కొల్లం గంగిరెడ్డి చంద్రబాబునాయుడుపై అలిపిరిలో జరిగిన హత్యాయత్నం కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. దాడి చేసిన నక్సల్స్ కు ఆయన ఆయుధాలు సమకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయన.. తర్వాత జగన్ తో పాటు ప్రయాణిస్తున్నారు. ఇ్పుడు ఆయనను పోలీసులు ఏ కేసులో అరెస్టు చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఓ స్థలవివాదంలో ఆయన ఇతరుల్ని బెదిరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే కొల్లం గంగిరెడ్డి అరాచకాలపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. గత కొన్నాళ్లుగా ఆయన చేసిన నిర్వాకాల గురించి ఆరా తీసేందుకు పోలీసులు రడీ అయినట్లుగా తెలుస్తోంది.