విజయవాడ సీపీ కాంతి రాణా నేతృత్వంలో పోలీసులు ముంబైకి చెందిన ఓ నటి కుటుంబాన్ని గత ఫిబ్రవరిలో అక్రమ కేసులో ఇరికించిన వైనం వ్యవహారంలో తీగ లాగితే డొంకంత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అందులో బడా బడా వ్యక్తులే ఉన్నారు. అసలు తెర వెనుక ఇంత జరిగిందా అని అంతా ఆశ్చర్యపోయేలా వ్యవహారాలు ఉన్నాయి. ఆ క్రైమ్ కథ క్రోనాలజీ ఎలా ఉందో చూద్దాం.. !
డిసెంబర్లో సజ్జన్ జిందాల్‌పై ముంబైలో ఓ నటి కేసు
సజ్జన్ జిందాల్. ఈ పేరు తెలియని వారు బిజినెస్ రంగంలో దాదాపుగా ఉండరు. ఆయన JSW కంపెనీ అధిపతి. ఆయనపై ముంబైలో గత డిసెంబర్లో ఓ కేసు నమోదు అయింది. ముఫ్పై ఏళ్ల వయసు ఉండే కాదంబరి నరేంద్రకుమార్ జెత్వాని అనే మహిళ ఈ కేసు పెట్టారు. తనను పెళ్లి చేసుకుంటానని అత్యచారం చేసి మోసం చేశారని ఆ కేసు నమోదు చేశారు. సజ్జన్ జిందాల్ ఎలా పరిచయం అయ్యారో… ఎలా మోసం చేశారో కాదంబరి ఈ కంప్లైంట్లో వివరించారు. సజ్జన్ జిందాల్ దేశంలో పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త కావడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు వ్యవహారం హైలెట్ అయింది.
ఫిబ్రవరిలో జెత్వానీ ఫ్యామిలీని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు
సజ్జన్ జిందాల్‌పై ముంబైలో కేసు పెట్టిన నటి కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వానీ పై విజయవాడ పోలీసులు పిబ్రవరిలో కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామిక వేత్త తమను రూ. ఐదు లక్షలకు మోసం చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టు చూపించారు. ఉగ్రవాదుల్ని అరెస్టు చేయడానికి వెళ్లినట్లుగా పెద్ద బలగాన్ని వేసుకుని ముంబైకి వెళ్లారు. ఒక్క కాదంబరినే కాకుండా మొత్తం ఆమె కుటుంబాన్ని తీసుకు వచ్చి జైల్లో వేశారు. తర్వాత కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది. వాళ్లు ముంబై వెళ్లిపోయారు. ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు బయట పడింది. ముంబై నుంచి ఓ నటి ఫ్యామిలీని తీసుకువచ్చి అరెస్టు చూపించినా విషయం బయటకు రాలేదు. కాంతి రాణా టాటా మీడియా ముందు ప్రకటించలేదు.
జిందాల్ పై పెట్టిన కేసుకు.. విజయవాడ కేసుకు సంబంధం ఉందా ?
కాదంబరి జెత్వానీ కేసుల వ్యవహారంలో అటు ముంబైలో ఆమె పెట్టిన కేసుకు.. ఇటు విజయవాడలో పోలీసులు పెట్టిన కేసుకు లింక్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత మార్చిలో ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్‌పై పోలీసులు కేసు ఉపసంహరించుకున్నారు. ఆ కేసు.. ఈ కేసుకు మధ్యలో ఏదో జరగబట్టే… కేసు కంచికి పోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ విషయాన్ని స్వయంగా వారే.. కడప స్టీల్ ప్లాంట్ కు మూడో సారి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పుకున్నారు కూడా.
తెర వెనుక స్టోరీ చాలా పెద్దది !
అసలు విషయం ఏమిటంటే.. ఆ ముంబై నటి జెత్వానీకి.. జిందాల్ కుటుంబం సభ్యుడికి మధ్య లవ్ స్టోరీ ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ జిందాల్ ఫ్యామిలీ అంగీకరించలేదు. కానీ ఆ నటి కుటుంబం తగ్గలేదు. చివరికి బెదిరింపులు.. బుజ్జగింపులు.. దశ గాడి తప్పడంతో ఆమె ముంబైలో సజ్జన్ జిందాల్ పై కేసు పెట్టింది. ఈ వ్యవహారం సెటిల్ చేయడానికి తంటాలు పడిన సజ్జన్ జిందాల్… ఏపీలోని తన మిత్రుల్ని సంప్రదించారు. వారు ఓ రేటు కట్టి.. తమదైన పద్దతిలో సెటిల్ చేస్తామని భరోసా ఇచ్చి.. పోలీసుల్ని రంగంలోకి దింపారు. అనధికారిక హోం మంత్రిగా పోలీస్ డిపార్టుమెంట్ ను చేతుల్లో పెట్టుకుని ఇలాంటి దందాలకు వాడుకున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో కాంతిరాణా టాటా అసలు పని పూర్తి చేశారు. మొదట ఆ కుటుంబాన్ని తీసుకు వచ్చేందుకు విద్యాసాగర్‌తో కంప్లైంట్ పెట్టించారు. తర్వాత విజయవాడకు తీసుకు వచ్చారు. ఓ గెస్ట్ హౌస్ లో పద్దెనిమిది రోజుల పాటు టార్చర్ పెట్టారు. విద్యాసాగర్ ఫిర్యాదు చేయించి అరెస్టు చూపించారు. తర్వాత వారు రాజీకి రావడంతో.. పోలీసులే బెయిల్ కూడా తమ వాళ్లనే పూచికత్తులుగా పెట్టి ఇప్పించి ముంబై వెళ్లిపోయేలా చేశారు. తర్వాత సజ్జన్ జిందాల్ పై ముంబైలో కేసు పోలీసులు ఉపసంహరించుకున్నారు.
నిజాలు బయటకు తీయాల్సిన అవసరం
ఈ వ్యవహారంలో అసలు నిజాలు పోలీసులు బయటకు తీయాల్సి ఉంది. ఉన్న పళంగా ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుల్ని కలిసి.. భరోసా ఇచ్చి నిజాల్ని చెప్పించుకోవాల్సి ఉంది. ఎంతటి సీరనియర్ అధికారులు ఇందులో ఉన్నా సరే వదిలి పెట్టకూడదు. పోలీసులు ఇలాంటి మాఫియా పనులకు పాల్పడితే ఇక సామాన్యులకు దిక్కెవరు ?