అల్లు అర్జున్ కామెంట్స్ విషయంలో జనసేన పార్టీ నాయకులు అతిగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ తనకు ఇష్టమైతేనే వస్తానని.. మిత్రుల కోసం ఎక్కడికైనా వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆ స్టేట్ మెంట్ ఆధారంగా అటు జనసేన పార్టీ నేతలు.. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కొంత మంది తెరపైకి వచ్చి రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ తాను చెప్పాలనుకున్నది చెప్పారు. దాని వల్ల జనసేన పార్టీకి వచ్చేది..పోయేది ఏమీ లేదని ఎన్నికలతోనే తేలిపోయింది. సైలెంట్ గా ఉండకుండా.. అటు వైపు..ఇటు కామెంట్లు చేసుకుంటూండటంతో సమస్య విస్తృతి పెరుగుతోంది.
సంబంధం లేని వారి కౌంటర్లతో పెరుగుతున్న దూరం
అల్లు అర్జున్ మామ.. పవన్ కల్యాణ్.. పుష్ప హీరో విషయంలో ఏదో అన్నారని టీవీ చానల్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నిజానికి ఆ చానల్లో ఆయన మాట్లాడింది పది మంది కూడా చూడరు. కానీ దాన్ని కట్ చేసుకుని వైరల్ చేసుకున్నారు. పవన్ కల్యాణ్ ను ఆయన క్షమాపణలు చెప్పాలని అడగడమే కాస్త విచిత్రంగా ఉంది. అసలు ఆయనకు సంబంధం లేని విషయం ఇది. దీనిపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. కౌంటర్ గా.. తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించడం.. ఆయన స్పందన ఆయన సహజ శైలిలో ఘాటుగా ఉండటంతో మరింత వివాదాస్పదం అవుతోంది.
అడ్వాంటేజ్ తీసుకుంటున్న వైసీపీ
ఇలా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్న అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిపోయింది. అల్లు అర్జున్ ను తమ వాడిని చేసేసుకుని ఆయన తరపున జనసేన పార్టీని.. ఆ పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. వైసీపీ సోషల్ మీడియా వ్యూహాలు అత్యంత నీచంగా ఉంటాయి. అలాంటివే ప్రారంభించారు. అల్లు అర్జున్ తమ వాడిగా చూపించుకుంటూ వారు చేస్తున్నప్రచారం దారి తప్పుతోంది.
అర్జున్ చేసింది రాజకీయం కాదు !
నిజానికి అల్లు అర్జున్ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.. వైసీపీకి ప్రచారం చేయలేదు. తర్వాత టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీలో కూడా పాల్గొన్నాడు. ఇక్కడ రాజకీయాల్లేవు. ఆయనది వేరే టైప్. కానీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చి.. విమర్సలు చేయడం ద్వారా.. జనేసన పార్టీకి ఎలాంటి లాభం ఉండదు.. పైగా నష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదానికి జనసేన పార్టీనే వీలైనంత వరకూ ముగింపు పలికితే.. వైసీపీకి చాన్స్ ఇచ్చినట్లుగా ఉండదని అంచనా వేస్తున్నారు.