రెండు రోజుల కిందట పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఎవరూ చనిపోలేదు కానీ.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ హెలికాఫ్టర్ ను తెప్పిస్తున్నది ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటనల కోసం అని ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక్క సారిగా సంచలనంగా మారింది. ఇలాంటి అన్ ఫిట్ హెలికాఫ్టర్ ను చంద్రబాబు కోసం ఎవరు తెప్పిస్తున్నారన్నది చర్చనీయాంశం అయింది.
ముఖ్యమంత్రి పర్యటనల కోసం .. హెలికాఫ్టర్లు ఉపయోగించాలంటే.. నిర్దిష్టమైన విధానాలు ఉంటాయి. నిబంధనలు ఉంటాయి. పదేళ్లు దాటిన హెలికాఫ్టర్లను అసలు ఉపయోగించరాదు. సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నా.. మంచి సామర్త్యం ఉన్న హెలికాప్టర్లనే హైర్ చేసుకోవాలి. కానీ పుణె నుంచి వస్తూ మధ్యలోనే కుప్పకూలిన హెలికాఫ్టర్ ఏ విధంగా చూసినా.. నిబంధనలకు అనుగుణంగా లేదన్న విషయం బయటపడింది. అలాంటి హెలికాఫ్టర్ ను పట్టుబట్టి ఓ అధికారి రప్పిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణను ఇంటలిజెన్స్ అధికారులు చేపట్టినట్లుగా తెలుస్తోంది . గతంలో జగన్ రెడ్డి బయటకు రావడమే తక్కువగా ఉండేది. అయినా ఆయనకు రెండు అత్యాధునిక హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచేవారు. రెండు కిలోమీటర్లకూ హెలికాఫ్టర్‌లో వెళ్లేవారు . ఇప్పడు చంద్రబాబు దాదాపుగా ప్రతి రోజూ పర్యటనలకు వెళ్తున్నారు అయినా.. అలాంటి హెలికాఫ్టర్‌ను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయడం వెనుక కుట్ర ఉందో లేదో కానీ.. క్షమించరాని నిర్లక్ష్యమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.