కావాలంటే తనపై మరోసారి బల్లెట్లతో దాడి చేయాలని కానీ తన కాలేజీ భవనాల జోలికి రావొద్దని అక్బరుద్దీన్ ఓవైసీ బరువైన డైలాగ్ చెప్పి గంటలు కాక ముందే.. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆయన కాలేజీనేనని లీకులు బయటకు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ కంటే అత్యంత ఘోరంగా మ్యాపుల్లో ఫాతిమా ఓవైసీ కాలేజీ ఆక్రమణ కనిపిస్తుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లుకాదు..అసలు చెరువులోకి వెళ్లిపోయి పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. వాటిలో ఉచిత చదువు చెప్పిస్తున్నామని ఓవైసీ చెబుతున్నారు.
అయితే ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కాలేజీల కూల్చివేత లిట్మస్ టెస్టుగా మారింది. రేవంత్ చిత్తశుద్ధికి అదో పరీక్షగా అందరూ చెబుతున్నారు. దీంతో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్నారు. ఇప్పటికే రిపోర్టుల పరంగా అన్నీ రెడీ చేసుకున్నారు. కూల్చివేత గంటల్లోనే పూర్తి చేయాలంటే..ఎలాంటి ఏర్పాట్లు ఉండాలన్నదానిపైనా ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. కూల్చివేత పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు.
అయితే ఓవైసీ బ్రదర్స్ తో కాలేజీల నిర్వహణ అంశంపై కొంత మంది చర్చలు జరుపుతున్నారని.. ఆ కాలేజీలు నిజంగా సేవాభావంతో నిర్వహిస్తూంటే.. పేద ప్రజలకు అన్యాయం జరగకుండా.. స్థలం విషయంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చే దిశగా ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు. చెరువుల కబ్జాను తప్పనిసరిగా సంస్కరించాల్సిందే కాబట్టి ఆ భవనాలు కూల్చివేత తప్పదని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పరిణామాలు ఎలా ఉన్నా కూల్చివేత ఖాయమని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మరో వైపు జన్వాడ ఫామ్ హౌస్ వద్ద కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. దాంతో రెండింటిని ఒకేసారి క్లీన్ చేస్తారా అన్న అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి.