హైడ్రా పనితీరుతో రేవంత్ సర్కార్ పై ప్రశంసల జల్లు కురుస్తోన్న వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. హైడ్రా ద్వారా ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేతలను కొనసాగిస్తూనే..మరోవైపు నగరంలో చెరువులను, కుంటలను కాపాడేందుకు సర్కార్ సిద్దం అవుతోంది.
చెరువులను చెరబట్టి ఇష్టారీతిన అక్రమ కట్టడాలు చేపట్టడంతోనే నగరానికి తరుచుగా వరద సమస్య వస్తోందని సీఎం సమీక్షలో చెప్తున్నారు. దీనిని చూసి చూడనట్లుగా వదిలేస్తే కేరళ, తమిళనాడు , ఉత్తరాఖండ్ తరహా పరిస్థితులు తెలంగాణలోనూ దాపురిస్తాయని , అందుకోసమే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హైడ్రాను తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్తున్నారు.
హైడ్రా దూకుడుతో ఒత్తిళ్ళు ఉన్నమాట నిజమేనని.. ఓ లక్ష్యం సాగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే చెరువులు , కుంటల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనలకు సర్కార్ ఒకే చెప్పింది.
గ్రేటర్ పరిధిలో మొత్తం 900కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో 30 శాతం మాయం కాగా, మరో 20 శాతం చెరువులు కబ్జాకు గురైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ కబ్జాల బారి నుంచి చెరువులను కాపాడేందుకు సైన్ బోర్డులతోపాటు లేక సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.