అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్, జగన్ నమ్మిన బంటు కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. రెండు రోజుల కిందట..ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి వదిలి పెట్టారు. అయితే ఆయన వెంటనే బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
కొల్లం గంగిరెడ్డి చేరికలకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారు నేరుగా పురందేశ్వరి సమక్షంలోనే బీజేపీలో చేరనున్నారు. కొల్లం గంగిరెడ్డి రైల్వే కోడూరు నియోజవకర్గంలో మండలంలో కీలక నేతగా ఉన్నారు. అందుకే ఆయనను చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేసుల నుంచి రక్షణ కోసమే ఇలాంటి నేతలు బీజేపీలో చేరుతున్నారని.. నిజానికి వీరంతా.. జగన్ కోసమే పని చేస్తారన్న ఆరోపణలు వస్తాయి.
గతంలో విదేశాల్లో దాక్కున్న ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేసితీసుకు వచ్చారు. జగన్ సర్కార్ వచ్చాక ఆయన బయటకు వచ్చారు. ఐదేళ్ల పాటు ఆయన అరాచకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్మగ్లింగ్ ను తన రేంజ్ లో చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆయన కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని తేలడంతో బీజేపీ వైపు చూస్తున్నారు.