రాజధాని లేని రాజధానిగా, మెట్రో రైలు లేని రాష్ట్రంగా… ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాజధాని ప్రాంతం, కొత్త నిర్మాణాలపై ఓ అవగాహనకు వచ్చిన సీఎం… డిసెంబర్ నుండి పనులను మళ్లీ ప్రారంభించనున్నారు.
ఇక, వైజాగ్ లో మెట్రో రైలు ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించబోతున్నారు. విశాఖలో రెండు దశల్లో మెట్రోను నిర్మించబోతున్నారు. ఫేజ్-1లో 46 కిలో మీటర్ల మేర 11,400 కోట్ల వ్యయంతో మెట్రో రైలు నిర్మించనుండగా, తరువాత ఫేజ్-2లో 30 కిలోమీటర్ల మేర 5,734 కోట్లతో మెట్రో రైలు నిర్మించబోతున్నారు. ఫేజ్-1 మెట్రో రైలు పనులు మొదలు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర 11వేల కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డితో సీఎం సమీక్ష నిర్వహించారు.