ఏపీలో పీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీలో పదవులను భర్తీ చేసేందుకు షర్మిల ఓ జాబితాను హైకమాండ్ కు సమర్పించి రోజులు గడుస్తున్నా.. అధిష్టానం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. షర్మిలపై పూర్తి నమ్మకం ఉంచి పీసీసీ పగ్గాలు అప్పగించినా..పార్టీ పదవులపై ఆమె అందజేసిన జాబితాకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తుండటంపై చర్చ జరుగుతోంది.
గత రాజకీయ అనుభవాల దృష్ట్యా పార్టీలో పట్టు బిగించేందుకు.. పీసీసీ రాష్ట్ర కమిటీలలో తన అనుచరుల పేర్లతో ఓ జాబితాను గత ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ కు షర్మిల అందజేశారు. అయితే, మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన నేతలను కాదని, ఎక్కువగా షర్మిల తన అనుచరులకు ప్రాధాన్యత ఇచ్చారంటూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంగానే షర్మిల సమర్పించిన జాబితాకు అధిష్టానం పచ్చజెండా ఊపకుండా హోల్డ్ లో పెట్టేసిందని టాక్ నడుస్తోంది. అయితే, షర్మిల మాత్రం తన మద్దతుదారులకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా … పార్టీని గాడిన పెట్టాలంటే అసాధ్యమని భావిస్తున్నారు. దీంతో పార్టీలో ఎలాంటి అసంతృప్తి రాగాలకు చోటు లేకుండా..పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కొద్ది రోజులు ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం జమ్మూ – కాశ్మీర్ , హర్యానా ఎన్నికలపై అధిష్టానం దృష్టి పెట్టడంతోనే ఈ విషయంపై ఫోకస్ చేయలేకపోతుందని..మరికొద్ది రోజుల్లోనే ఏపీ పీసీసీ పదవుల భర్తీపై దృష్టి సారించనుందని తెలుస్తోంది.