బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండగా.. తెలంగాణలోనూ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అత్యవసరం అయితే తప్ప నగర ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఇప్పటికే హైదరాబాద్ లో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. పలు చోట మోస్తరు వర్షం కురుస్తున్నా ఆకాశం మేఘావృత్తమై ఉండటంతో సాయంత్రం సమయానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అలాగే, రాబోయే 24 నుంచి 36 గంటలలో హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షపాతం (200-300 మి.మీ.) నమోదయ్యే సూచనలు ఉన్నాయని..2016, 2020లలో నమోదైన వర్షపాతంకు మించి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చునని అంటున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక, గంటకు 30నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వేస్తాయని.. ప్రజలు ఎవరూ చెట్ల కింద ఉండవద్దని సూచించారు.