అమరావతికి త్వరలో ప్రపంచ బ్యాంక్‌తో పాటు మరికొన్ని విదేశీ ఆర్థిక సంస్థలు భారీ మొత్తంలో రుణం మంజూరు చేయబోతున్నాయి. ప్రపంచ బ్యాంక్ బృందం మరోసారి అమరావతికి రానుంది. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వానికి అప్పటికి పదిహేను వేల కోట్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత వెనుదిగిరి చూడాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ అప్పులు ఎవరు కట్టాలన్న ప్రశ్న ఏపీలో వివాదాస్పదం అవుతూనే ఉంది. దానికి తాజాగా క్లారిటీ వచ్చేసింది.
బడ్జెట్లో రూ.పదిహేను వేల కోట్లు అమరావతికి ఇప్పిస్తామని కేంద్రం చెప్పింది. అంటే కేంద్రం గ్యారంటీగా ఉండి రుణం ఇప్పిస్తోంది. ఈ రుణంగా ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ( EAP ) కిందకు వస్తాయి. ఈ ప్రాజెక్టుల కింద ఆర్థిక సాయంలో కేంద్రం అత్యధిక వాటా చెల్లిస్తుంది. రాష్ట్రం అతి తక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అత్యంత ఎక్కువగా ఈ రేషియా 70:30 శాతం ఉంటుంది.
ఏపీకి సంబంధించి ఈ రేషియా 90:10 ఉంటుది. ప్రత్యేక ప్యాకేజీలో 90:10 శాతం ఇలాంటి ప్రాజెక్టుల్లో భరించాలని పెట్టారు. అంటే.. పదిహేను వేల కోట్లలో పదిహేను వందల కోట్లు మాత్రం ఏపీ భరించాలి. కానీ ఈ పది శాతం కూడా కేంద్రమే భరించేందుకు ముందుకు వచ్చింది. అంటే.. పూర్తి స్థాయిలో ప్రపంచబ్యాంక్ లేదా మరో విదేశీ సంస్థ అమరావతికి రుణానికి చెల్లింపులు చేసేది కేంద్రమే. రాష్ట్రంపై ఒక్క రూపాయి భారం పడదు. అమరావతి అభివృద్ధి వల్ల జరిగే సంపద సృష్టి అంతా.. రాష్ట్ర ప్రజలకే చెందుతుంది.