టాలీవుడ్ కష్టాలు ఆగస్టులోనూ కంటిన్యూ అయ్యాయి. గత కొంతకాలంగా సరైన విజయం లేక అల్లాడుతున్న తెలుగు చిత్రసీమను ఆగస్టు కూడా ఒడ్డున పడేయ్యలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ దారుణంగా బోల్తా కొట్టడం ప్రధానమైన ప్రతికూలాంశం.
ఆగస్టు తొలి వారం నుంచే కొత్త సినిమాల విడుదల జోరందుకొంది. ‘శివం భజే’, ‘బడ్డీ’ చిత్రాలు తొలివారంలో వచ్చి ఫ్లాప్ టాక్ మూట గట్టుకొన్నాయి. రెండో వారంలో విడుదలైన చిన్న సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’ కాస్త అలరించింది. నిహారిక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతో పబ్లిసిటీ బాగానే జరిగింది. ఆగస్టు 15 సెలవల్ని క్యాష్ చేసుకొందామని వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ‘ఆయ్’ మాత్రం నవ్వించింది. ఆ సినిమాకు లాభాలు కూడా వచ్చాయి. విక్రమ్ అనువాద చిత్రం ‘తంగలాన్’ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అయితే వసూళ్లు మాత్రం దక్కలేదు. తమిళంలో మాత్రం హిట్ సినిమానే. సుకుమార్ బ్రాండ్ తో విడుదలైన ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
‘సరిపోదా శనివారం’ రివ్యూలు బెటర్‌గా ఉన్నప్పటికీ, వర్షాల వల్ల వసూళ్లకు దెబ్బ పడింది. ఈ సినిమానే ఆగస్టు 15న వస్తే ఫలితం వేరేలా ఉండేదేమో? కాకపోతే ఈమధ్య విడుదలైన సినిమాల్లో ‘సరిపోదా శనివారం’ బెటర్ రిజల్ట్ ని అందుకొందనే చెప్పాలి. అయితే.. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఈనెలలో ‘మురారి’, ‘ఇంద్ర’ రీ రిలీజ్ అయ్యాయి. ‘మురారి’ దాదాపు రూ.6 కోట్ల వరకూ వసూలు చేసింది. ‘ఇంద్ర’ రూ.3 కోట్లు తెచ్చుకొంది.