‘పవన్ కల్యాణ్ కోసం మీరైతే ఎలాంటి కథ రాస్తారు?’
— రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఎదురైన ప్రశ్న ఇది.
”పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదండీ. ఆయన తెరపై ఉంటే చాలు. ఆయన నటించిన పాత సినిమాల్లో సీన్లన్నీ కట్ చేసి అతికించినా సరిపోతుంది. కేవలం పవన్ కల్యాణ్‌ని చూడ్డానికే జనం థియేటర్లకు వెళ్తారు. అలాంటప్పుడు కథెందుకు” అన్నారాయన.
రచయిత పనిని ఇంత సింపుల్ చేసిన సూపర్ స్టార్ బహుశా… టాలీవుడ్ లోనే లేడేమో. ఇక రాడేమో..?!
‘ఇతని పేరు పవన్.. కానీ ఆయన తుపానులాంటోడు’
— స్వయంగా మోదీ ఇచ్చిన కితాబు ఇది.
అవును. గాలికి ఓ లెక్కుంటుంది. కనికరం ఉంటుంది. తుపానుకి అవేం ఉండవు. వచ్చిందంటే ఊడ్చుకొంటూ పోవడమే. మహా వృక్షాల్ని సైతం పెకిలించుకొని విధ్వంసం చూపించడమే. అదెలా ఉంటుందో 2024 ఎన్నికలు నిరూపించేశాయి. అధికారంలో ఉన్న పార్టీని చెప్పి మరీ అధఃపాతాళానికి తొక్కేసిన మరో రాజకీయ నాయకుడు మనకు కనిపించడేమో?
గెలిచి ఓడడంతో లెక్క సమానమవుతుంది.
కానీ ఓడిచ చోట గెలవడం ఓ కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది.
పవన్ ఓ చరిత్ర.
****
చిరంజీవి తమ్ముడ్ని ఇంకో చిరంజీవిగానే చూడాలనుకొంటారు అభిమానులు.
చిరంజీవిలా ఫైట్లు చేయాలి, చిరంజీవిలా డాన్సు చేయాలి, చిరంజీవిలా డైలాగులు చెప్పాలి.
అన్నీ చేస్తే ఇక చిరంజీవి ఎందుకు? అలానే చేస్తే పవన్ కల్యాణ్ ని ఇంతకాలం గుర్తు పెట్టుకోవడం ఎందుకు?
జాగ్రత్తగా గమనించండి. ‘మెగా’ వారసత్వంతో, ఆ ట్యాగ్ లైన్‌తో వచ్చిన హీరోలందరూ ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవిని ఇమిటేట్ చేద్దామని చూశారు. చిరంజీవి టైటిల్, చిరంజీవి పాట వాడేయాలన్న తాపత్రయం వాళ్లకు ఉంటుంది. అలా చేయడం తప్పు కూడా కాదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. పవన్ ఇప్పటి వరకూ చిరంజీవి పాటని రీమిక్స్ చేయలేదు. ఎందుకో తెలుసా..? తనదైన ‘సొంత ముద్ర’ చూపించాలన్న తపన. డాన్స్‌లో, ఫైట్స్‌లో చిరు వేరు, పవన్ పూర్తిగా వేరు. ఇద్దరికీ పోలికలు లేవు.
”నాకొచ్చిన నాలుగైదు స్టెప్పుల్నీ అటూ ఇటూ తిప్పి వేస్తానంతే. కొత్తగా ప్రయత్నించలేను” అని ఏ హీరో అయినా చెప్పగలడా?
పవన్ చెప్పాడు.
”నాకు తెరపై రొమాన్స్ చేయాలంటే చచ్చేంత సిగ్గు. ఆ క్షణంలో సెట్లో ఎవరైనా ఉంటే ఇంకా ఇబ్బంది” అనడం ఓ స్టార్‌కు మామూలు విషయమా?
మెడ మీద చేయి తీసుకెళ్లి రుద్దితే… థియేటర్లు బద్దలైపోవడం ఏమిటి?
ఆ.. ఆ.. ఆ… అంటే ఆ డైలాగ్‌కి.. ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం ఏమిటి?
ఫ్యాంటు మీద ఫ్యాంటు వేస్తే, ఎర్ర తుండు తలకు చుట్టుకొంటే, అదే ఫ్యాషన్ అయిపోవడం ఏమిటి?
ఏముంది అందులో..? అదే పవన్ మ్యాజిక్! కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడిటోరియం మొత్తాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడం కేవలం సూపర్ స్టార్లకే సాధ్యం. ఆ లెక్కన ఇండియాలోని ఏ సూపర్ స్టార్కీ పవన్ తీసిపోడు.
సుస్వాగతం.. తొలిప్రేమ.. తమ్ముడు..
మనలోంచి ఒకడు హీరో అయ్యాడన్న ఫీలింగ్ వచ్చింది.
బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్..
మనకోసం ఒకడు హీరోలా వచ్చాడు అన్న భరోసా కలిగింది.
అదే అతన్ని పవర్ స్టార్‌గా కూర్చోబెట్టింది.
‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం’
‘ప్యాకేజీ స్టార్’
‘రెండు చోట్లా ఓడిపోయాడు’
‘మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడు’
‘దత్త పుత్రుడు’
తను అనుకొంటే యేడాదికి వందల కోట్లు సాధించగల స్టామినా ఉన్నా, ఇన్ని మాటలు ఎందుకు పడ్డాడు? కోరుకొంటే ప్రపంచంలోని సకల సౌకర్యాలూ కాళ్ల మీద వచ్చి పడతాయి కదా.. మరి నడి రోడ్డు మీద మండుటెండల్లో ఎందుకు తిరిగాడు. తాను
సంపాదించింది అలానే దాచుకోలేదు. ఆస్తులు కూడ బెట్టలేదు. ప్రతీ పైసా మళ్లీ ప్రజలకే ఖర్చు పెట్టాడు. ఇదంతా ఎందుకు..?
పవన్ హీరోగా వచ్చేటప్పుడు… వెనుక చిరంజీవి ఉన్నాడులే అన్న ధైర్యం ఉంది.
రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఒంటరి వాడే. పైగా “అన్నయ్యే ఫెయిల్ అయ్యాడు, తమ్ముడేం చేస్తాడులే” అనే సూటిపోటి మాటలు వినిపించాయి. పవన్ లో ఆవేశమే తప్ప, ఆలోచన లేదన్నారంతా.
21 సీట్లకు పరిమితమైపోయినప్పుడు సొంత పార్టీ వాళ్లే విమర్శించారు. ‘నా’ అనుకొన్న వాళ్లే… నొసలు చిట్లించారు. కానీ ఇవన్నీ భరించాడు పవన్.
ప్రజలకు ఏదో చేయాలన్న తపన. ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలన్న సంకల్పం. పవన్ వ్యక్తిత్వం, నిజాయతీ, తన సినిమాల్లోని హీరోయిజం కంటే గొప్పగా ఉంటుంది. పవన్ సినిమా ఎప్పుడైనా పట్టాలు తప్పిందేమో కానీ, పవన్ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. అదే అతన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం రేంజ్లో కూర్చోబెట్టింది. ఏమో… భవిష్యత్తులో ఇంకా అందనంత ఎత్తుకు ఎదుగుతాడేమో? ఎవరికి తెలుసు..?
బండ్ల గణేష్ ఓ మాట అన్నాడు. ‘పవన్ కల్యాణ్ లాంటోళ్లు లిమిటెడ్ ఎడిషన్’ అని. పవన్ లాంటి పీసులు రేర్‌గా దొరుకుతాయి. పవన్ లిమిటెడ్ పీసే. కానీ తన పవర్ అన్ లిమిటెడ్! పవన్ అంటే పవర్ స్టేషన్. దాన్ని వాడుకోవాలే కానీ, ఆడుకోకూడదు. అలా అనుకొంటే అణు విధ్వంసాలే.. అధఃపాతాళాలే!
(పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా)