ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయి ఐదున్నర నెలల పాటు జైల్లో ఉన్నారు. మహిళా నేత అవినీతి కేసులో జైలుకు వెళ్లడం ఒకటి అయితే.. అదీ కూడా లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లడం అవమానం లాంటిదే. తనది రాజకీయ ప్రేరేపిత కేసు అని కవిత గట్టిగా వాదిస్తున్నారు. అయితే అయి ఉండవచ్చు కానీ.. ఇలా ఇంతగా టార్గెట్ అయిపోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా స్వయంకృతమే అనుకోవచ్చు. జరిగిన పరిణామాల్ని విశ్లేషించుకుంటే అదే కనిపిస్తోంది.
బీఎల్ సంతోష్ అరెస్టుకు పోలీసుల్ని పంపిన కేసీఆర్
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో వేసిన ట్రాప్ లో … ముగ్గురు అనామక వ్యక్తులు దొరికిన తర్వాత… వారి వెనుక ఉన్నది బీఎల్ సంతోష్ అని కేసు పెట్టేసి… ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారు కేసీఆర్. ఈ బీఎల్ సంతోష్ అనామకుడు కాదు. మోదీ, అమిత్ షా తర్వాత అంతటి పవర్ ఫుల్ వ్యక్తి. ఆయన జోలికి వస్తే.. బీజేపీ ఊరుకుంటుందా ? . తామేమిటో చూపించాలనుకోదా ?. అక్కడ్నుంచి జరిగిన రాజకీయమే తదుపరి ఘటనలు అనుకోవచ్చు. ఇక్కడ కవిత అరెస్టు మాత్రమే కాదు… బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేసింది కూడా బీజేపీనే.
ముందుగా బీఆర్ఎస్ను ఓడించారు !
ఫామ్ హౌస్ కేసు.. బీఎల్ సంతోష్ అరెస్టుకు ప్రయత్నాలు చేసిన తరవాత బీజేపీ రాజకీయం మారిపోయింది. ఖచ్చితంగా కేసీఆర్ అనుభవిస్తారని బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చి హెచ్చరించిపోయారు. బీజేపీ అప్పట్లో తెలంగాణలో జోరు మీద ఉంది. అయితే అధికారంలోకి వచ్చేంత లేదు. కానీ ఓట్లు చీలడం ద్వారా బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ముందుగా తాము గెలకపోయినా.. బీఆర్ఎస్ ను ఓడించాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది. వెంటనే బండి సంజయ్ ను మార్చేసింది. ఫలితంగా ముఖాముఖి పోరు వచ్చేసింది. బీజేపీ వెనుకబడిపోయినా అనుకున్న లక్ష్యం ముందు కేసీఆర్ను ఓడించడాన్ని చేసింది.
తదుపరి కవిత అరెస్ట్
బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కవితను అరెస్టు చూపించింది. నిజానికి కవితను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అరెస్టు చేసి ఉంటే బీజేపీకి మైలేజీ వచ్చి ఉండేది. కానీ బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని కేసీఆర్ చేసిన ప్రయత్నం తోనే మొత్తం మార్చుకున్నారు. కేసీఆర్ పవర్ పోయేలా చేశారు. తర్వాత కవితను అరెస్టు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ .. బీజేపీ కనుసన్నల్లో ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు.
ఈ పరిస్థితులకు కారణం తెలుసుకుని రాజకీయం చేస్తేనే ఉనికి !
కవిత జైల్లో నుంచి బయటు వచ్చి భారీ శపథం చేశారు. కానీ ఎవరికి వడ్డీతో సహా చెల్లిస్తారో చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆమెకు ధైర్యం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుసు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్లనే బీఆర్ఎస్, కవిత ఎక్కువగా నష్టపోయారు. ఇప్పటికైనా తెలుసుకుంటే..ఉనికి కాపాడుకోవచ్చు కానీ.. లేకపోతే ఈ కష్టాలు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది.