‘గబ్బర్ సింగ్’… ఈ సినిమా విడుదలై 12 ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ అదే వైబ్రేషన్. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఓ కొత్త సినిమా విడుదలైతే ఎంత బీభత్సం సృష్టిస్తారో, అంతే హడావుడి చేస్తున్నారు. షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ‘గబ్బర్ సింగ్’కు సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ ఇది.
‘గబ్బర్ సింగ్’తో చాలామంది జీవితాలు మారిపోయాయి. ఈ సినిమాతోనే బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయ్యాడు. హరీష్ శంకర్ ఒక్కసారిగా బిగ్ లీగ్ లోకి చేరాడు. చాలా కాలం తరవాత పవన్ కల్యాణ్‌కు దొరికిన సూపర్ హిట్ ఇది. అభిమానులూ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇదే సినిమాతో నాగబాబు కూడా గట్టెక్కేశారు. ఈ సినిమాకూ నాగబాబుకీ అస్సలు సంబంధమే లేదు. కానీ నాగబాబుని ఆర్థికంగా సెటిల్ చేసిన సినిమా ఇది.
అప్పటికి నాగబాబు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు. ఆయన్ని ఎలాగైనా ఆదుకోవాలన్న సంకల్పం పవన్ కల్యాణ్‌లో ఉండేది. ఓ సినిమా తీసి, దాని ద్వారా వచ్చిన లాభాల్ని నాగబాబుకి ఇద్దామనుకొన్నారు పవన్. అలాంటి సమయంలోనే ఆయన దృష్టి ‘దబాంగ్’పై పడింది. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ ద్వారా ఈ సినిమాని రీమేక్ చేసి, వచ్చిన లాభాలు నాగబాబు ఖాతాకు షిఫ్ట్ చేద్దామనుకొన్నారు. అయితే అదే సమయంలో బండ్ల గణేష్ ‘తీన్ మార్’ తీసి నష్టపోయాడు. అందుకే బండ్లనీ ఆదుకోవాలనిపించింది. అందుకే బండ్లని పిలిచి ‘దబాంగ్’ సినిమా రీమేక్ చేద్దాం. నిర్మాతవు నువ్వే. నాకు పారితోషికం వద్దు. లాభాల్లో వాటా కావాలి’ అన్నారు. బండ్లకు ఇది చాలా మంచి ఆఫర్. కాబట్టి ‘సరే’ అని ముందుకు దూకేశాడు. హరీష్ శంకర్ చేసిన మార్పులు చేర్పులూ, సెట్లో ఆ వైబ్రేషన్ చూసి పవన్‌కు అర్థమైపోయింది. ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని తెలిసిపోయింది. పైగా బండ్ల గణేష్ కూడా ఈ సినిమాపై అహర్నిశలూ కష్టపడే విధానం ఆయనకు నచ్చింది. అందుకే బండ్లని మళ్లీ పిలిచి ‘నాకు వాటా ఏం వద్దు. లాభాలన్నీ నువ్వే తీసుకో. పారితోషికం ఇస్తే చాలు’ అని ఇంకో ఆఫర్ ఇచ్చారు. ఆ పారితోషికం మొత్తం నాగబాబుకే ఇచ్చేశారు పవన్ కల్యాణ్. ”నిజానికి లాభాల్లో వాటాకే కట్టుబడి ఉంటే పవన్ కల్యాణ్ కు ఇంకా భారీగా డబ్బులు వచ్చేవి. కానీ సినిమా కోసం బండ్ల గణేష్ కష్టపడిన విధానం చూసి లాభాల్ని వదులుకొన్నాడు పవన్. ఆ డబ్బులు కూడా నాకే ఇచ్చి నన్ను ఆర్థికంగా ఆదుకొన్నాడు. నిజానికి అప్పట్లో కల్యాణ్ ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగోలేదు. తనకూ డబ్బులు చాలా అవసరం. కానీ నన్ను గట్టెక్కించడం కోసం ఆ డబ్బులన్నీ నాకే ఇచ్చాడు”. అంటూ అప్పటి విశేషాల్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకొన్నారు నాగబాబు.