తెలంగాణ బీజేపీ ఎంపీలకు అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ట్రాక్ లు ధ్వంసం కావడం.. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో కేంద్రం నుంచి ఎంతమేర సాయాన్ని రాబడుతారు అనేది బిగ్ డిబేట్ గా మారింది.
తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు..అందులో ఇద్దరు కేంద్రమంత్రులూ ఉన్నారు..గతానికి భిన్నంగా రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దీంతో కేంద్రం రాష్ట్రానికి ఎంతమేర వరద సాయం చేయనుంది? ఇందుకోసం ఎంపీలు ఎలాంటి చొరవ చూపిస్తారు..? అనే దానిపై చర్చ నడుస్తోంది.
ఇప్పటికే కేంద్రమంత్రి జేపీ నడ్డా.. కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రంలోని వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వరంగల్ , ఖమ్మం జిల్లాలో వరద భీభత్సానికి 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వచ్చింది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయాన్ని ఆశిస్తోంది.
ఇక, ఏపీలోనూ వరదలతో భారీగా నష్టం జరిగింది.. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఏపీకి ఎన్ని నిధులు ఇస్తారు..? తెలంగాణకు ఎన్ని ఇవ్వనున్నారు..? అనే చర్చ జరుగుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణకు వరద నష్టం తక్కువే అయినా.. నిధుల విషయంలో కేంద్రం వ్యవహారశైలి.. తెలంగాణ బీజేపీకి చిక్కుముడులు తెచ్చి పెట్టనుందని.. దాన్ని బీజేపీ నేతలు ఎలా తిప్పుకోడుతారు అనేది ఆసక్తికరంగా మారనుంది.