ఉప్పెన సినిమాతో అరంగేట్రంలోనే ఓ సూపర్ హిట్ కొట్టాడు వైష్ణవ్ తేజ్. అయితే ఆ తరవాత కాలం కలసి రాలేదు. వరుసగా మూడు ఫ్లాపులు తగిలాయి. ఈసారి ఆచి తూచి అడుగు వేయకపోతే… కెరీర్ సందిగ్థంలో పడే ప్రమాదం ఉంది. అందుకే కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడిపోయాడు. చాలా కాలంగా వైష్ణవ్ తేజ్ ఏ కథనీ ఓకే చేయలేదు. ఇప్పుడు, ఎట్టకేలకు ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. రచయిత కృష్ణ చైతన్య చెప్పిన కథ వైష్ణవ్‌కు బాగా నచ్చింది. వీరి కాంబో దాదాపుగా ఓకే అయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫ్లాప్ అయినా, కథపై నమ్మకంతో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘భరత్ అనే నేను’ చిత్రంలోని ఓ పాట తొలి పంక్తి ఇది. దాన్ని టైటిల్ గా పెట్టారు. టైటిల్ అయితే వినగానే నచ్చేసేలా, క్యాచీగా ఉంది. మరి ఇది లవ్ స్టోరీనా, యాక్షన్ డ్రామానా అనేది తేలాల్సివుంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫ్లాప్ అయినప్పటికీ విశ్వక్ సేన్ ఈ దర్శకుడితో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. నితిన్ తో కృష్ణ చైతన్య చేయాల్సిన ‘పవర్ పేట’ రీమేక్ ఇప్పుడు విశ్వక్ సేన్‌తో చేస్తున్నట్టు సమాచారం. వైష్ణవ్ సినిమా పూర్తయ్యాకే.. ‘పవర్ పేట’ రీమేక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వచ్చాడయ్యో సామీ’ కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.