బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. తనకంటే బలమైన టీమ్ అయిన పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ లో చిత్తు చేసింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో అదరగొట్టి పాక్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
ఇప్పుడు రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. జకీర్ హసన్ (40), షాద్మాన్ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్ రహీమ్ (22), షకీబ్ అల్ హసన్ (21) తో రాణించారు.
బంగ్లా టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశాల్లో ఆ జట్టుకిది ఎనిమిదో గెలుపు. సొంతగడ్డ ఆవల గత ఏడేళ్లలో ఆ జట్టుకిది మూడో విజయం. విదేశాల్లో చివరిసారిగా 2022 జనవరిలో న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇప్పటి వరకు బంగ్లా ఆడిన 143 టెస్టుల్లో ఇది 21వ విజయం.
పాకిస్థాన్ జట్టుకు ఈ ఓటమి తీవ్ర పరాభవం అనే చెప్పాలి. ఇప్పటికే సీనియర్లు, అభిమానులు ఆ జట్టు ఆట తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జట్టుని సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు బౌలింగ్ బ్యాటింగ్ రెండిటిలో విఫలమైన పాక్ జట్టు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటుంది.