వరదల సమయంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాయి అన్నది చాలా ముఖ్యం. కష్టాల్లో ప్రజలను ఓదార్చుతూ, అండగా ఉండే ప్రయత్నం చేయటం ముఖ్యం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, సర్వం కోల్పోయిన ఆ ప్రజలను కాపాడే బాధ్యత అందరిదీ.
కానీ, ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబా బాద్ జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం స్పందించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. అధికారులు సహయక చర్యల్లో చేసిన అలసత్వం స్పష్టంగా కనపడింది. ఓవైపు విజయవాడలో వరదలు వస్తే అక్కడి సీఎం, అధికారులు అర్ధరాత్రి కూడా ప్రజల మధ్య ఉంటే… మన దగ్గర ఎందుకు లేదు అని అంతా చర్చించుకున్నారు.
పోతే నా ప్రాణం… వస్తే ఏడుగురి ప్రాణాలు అంటూ జేసీబీతో ఓ వ్యక్తి చేసిన సాహసం అందరిచేత ప్రశంసలు అందుకుంది. కానీ ఓ యంగ్ సైంటిస్ట్ ప్రాణాలు కాపాడలేకపోయిన నిస్సహాయత కూడా వెక్కిరించింది. ఆస్తినష్టం అయితే చెప్పాల్సిన పనిలేదు.
సరే, ప్రభుత్వం ఫెయిల్ అనుకుంటే ప్రతిపక్షం అయినా వచ్చిందా అంటే అదీ లేదు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితం అయ్యారు. కనీస స్పందన లేదు. కేటీఆర్ అమెరికాలో ఉంటే మూడో రోజు హరీష్ రావు జనంలోకి వచ్చారు. రెండో రోజు నుండి కిందిస్థాయిలో ఒకరిద్దరు నేతలు తమ స్వస్థలంలో బయటకు వచ్చిన పరిస్థితి.
సీఎం రేవంత్ ఖమ్మం పర్యటన చేసినా, బాధితుల దగ్గరకు వెళ్లినా ఆలస్యంగా వెళ్లారు… అని కాంగ్రెస్ శ్రేణులు సైతం పెదవి విరిస్తున్నారు.