విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల పరామర్శకు వెళ్ళిన వైసీపీ అధినేత జగన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వరదలు వచ్చి ఐదు రోజులు అయిన తర్వాత తీరిగ్గా ఎందుకు వచ్చారంటూ మహిళలు నిలదీయడంతో… జగన్ అక్కడి నుంచి వెనుదిరిగారు.
బుధవారం సాయంత్రం రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల పరామర్శకు వెళ్లగా… రెండు గంటల్లోనే జగన్ తన పర్యటనను ముగించారు. కాలనీ ప్రధాన రోడ్డుపై 500మీటర్ల దూరం పర్యటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వరదలు వచ్చి తామంతా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వస్తారా అంటూ మహిళల నిలదీతతో జగన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రజల ఆగ్రహాన్ని గమనించి అతి తక్కువ సమయంలోనే తన పర్యటనను ముగించారు.
సోమవారం విజయవాడలోని సింగ్ నగర్ లో పర్యటించిన జగన్ కు ఇదే తరహ అనుభవం ఎదురైంది. ఏమ్మా .. మీకు సర్కార్ నుంచి అన్ని సదుపాయాలూ అందుతున్నాయా? అని ప్రశ్నించగానే..కొంతమంది సరకులు తెచ్చి ఇచ్చారు.. అయినా పీకల్లోతు నీళ్లు ఉన్నాయి.. వాళ్ళయినా ప్రతి ఇంటికి రావడం సాధ్యం అవుతుందా? అని మహిళా ఇచ్చిన సమాధానంతో జగన్ బేల మొహం వేశారు.
తాజాగా అదే తరహా సమాధానంతో తన పర్యటనను ముగించుకొని ఇంటి బాట పట్టారు జగన్.