చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే పబ్లిసిటీ కోసం వెళ్లాడంటారు. వెళ్లకపోతే వెళ్లలేదంటారు. లోకేష్ కనిపించకపోతే ఏడుస్తారు. పవన్ కల్యాణ్ వెళ్లినా.. వెళ్లకపోయినా ఏడుస్తారు. వైసీపీ నేతల ఏడుపులకు కారణం ఉండక్కర్లేదు. ఏం చేసినా… దానికి వ్యతిరేకంగా చేయలేదని ఏడుస్తారు. వారి తీరుతో సొంత పార్టీ నేతలు, క్యాడర్ లకు తల ఎత్తుకునే పరిస్థితి లేకపోయినా వారి తీరులో మార్పు మాత్రం లేదు.
విజయవాడలో సహాయ కార్యక్రమాల్లో ఒక్క వైసీపీ నేత కూడా కనిపించలేదు. తమకు ఐదేళ్లు అధికారం ఇస్తే దాన్ని ఉపయోగించుకుని అడ్డగోలుగా సంపాదించుకుని బుడమేరు మొత్తం ఆక్రమించుకుని ఇళ్లు కట్టిన ఫలితం ఇప్పుడు బెజవాడపై పడింది. తాము వెళ్తే అన్ని తెలిసిపోతాయని సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బయట మాత్రం రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పని చేస్తే… చేస్తున్నారని.. ఫోటోలు తీసుకుంటున్నారని ఏడుస్తున్నారు. నారా లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూంటే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారని ఏడుస్తారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ అని మరో వైపు ఏడుస్తూంటారు. ఫీల్డ్ లోకి వెళ్తే… పవన్ కోసం జనం వస్తారు. గందరగోళం ఏర్పడుతుంది. అలా జరిగితే మరింతగా ఏడవొచ్చని భావన. పవన్ వెళ్లకపోతే పవన్ వెళ్లలేదని ఏడుస్తారు. వైసీపీ నేతల తీరు చూసి సామాన్య జనం కూడా అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీగా ఓ స్టాండ్ మీద ఉండి ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోతే ఒత్తిడి చేయాలి కానీ.. ఇలా ఏదో ఒక విధంగా విమర్శిస్తూ పోవడం తప్ప… ప్రత్యేక విధానం లేకపోవడం ఆ పార్టీ దివాలా కోరు తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.