చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు సహకరిస్తానని డైలాగ్ లు కొట్టిన మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో తన అరెస్ట్ ఖాయమని భావించే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.
టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న వైసీపీ నేతల పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడం.. ఆ తర్వాత తమపై రెండు వారాలపాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్ట్ తోసిపుచ్చడంతో.. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో అరెస్ట్ ఖాయమని ఈ కేసులో నిందితులుగా ఉన్న నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు బుధవారం సాయంత్రమే ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నారని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక , ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాష్ తోపాటు మరికొంతమంది నేతల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
అలాగే, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయగానే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.