ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లా భారీగా నష్టపోయింది. నాలుగు రోజులు అవుతన్నా, ఇప్పుడిప్పుడే వరద భయం నుండి ప్రజలు బయటకొస్తున్నారు. జరిగిన ఆస్తి నష్టంపై ఇంకా అంచనాకు రావాల్సి ఉంది.
ఈ వరదల సమయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవటంతో నష్టం ఎక్కువైందన్నది బాధితుల మాట. అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం, ప్రభుత్వం మొదట్లో వెంటనే స్పందించలేదన్న విమర్శలున్నాయి.
అయితే, ఇప్పటి వరకు ఈ సీన్ లోకి బీజేపీ ఎంటర్ కాలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచిందని, వరదల్లో నష్టపోయిన వారి కోసం ఫండ్స్ కూడా ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం తమకు వివరాలు ఇవ్వలేదని కేంద్రం నుండి సీఎస్ కు ఉత్తరం కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందనే సరిగ్గా లేదు అన్నది దాని సారాంశం.
ఇక, ఇప్పుడు బీజేపీ రెండు గ్రూపులుగా వరదల్లో నష్టపోయిన వారిని పరామర్శించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో, ఎంపీ ఈటల రాజేందర్ మహబూబా బాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ఆయన కూడా రాబోతున్నారు.
శుక్రవారం ఖమ్మం, మహబూబా బాద్ లో రైతులతో మాట్లాడి, పంట నష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించబోతున్నారు.
గురువారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విజయవాడతో పాటు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించున్నారు.