జైనూరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అసలు అక్కడేం జరిగిందన్నది కూడా చాలా మందికి తెలిదు. ఓ ఆదివాసి మహిళపై ముస్లిం ఆటో డ్రైవర్ హత్యాచార యత్నం చేయబోయాడన్నది మాత్రం హైలెట్ అవుతోంది. ఇక్కడ మతాల ప్రస్తావన రావడంతో ఘర్షణలకు దారి తీశాయి. ఎంతగా అంటే కర్ఫ్యూలు విధించాల్సి వస్తోంది.
జైనూరులో ఐదు రోజుల కిందట ఓ ఆదివాసీ మహిళ తన గ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్ వద్ద ఆటో ఎక్కింది. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటోలో పెనుగులాట చోటు చేసుకుంది. దాంతో డ్రైవర్ ఆమెను పక్కకు లాగి పడేసి వెళ్లిపోయాడు. ఆ మహిళ అపస్మారక స్థితికి వెళ్లింది. స్థానికులు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులకు ఆమెకు స్పృహ వచ్చింది. తనపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేయబోయాడని చెప్పింది. ఆ ఆటోడ్రైవర్ పేరు కూడా చెప్పింది.
వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ అటోడ్రైవర్ పేరు షేక్ మగ్ధూం. దాంతో మెల్లగా విషయం రాజకీయం అయిపోయింది. బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. రాజాసింగ్ , బండి సంజయ్ వంటి వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఉద్రిక్త ప్రారంభమైంది. జైనూరులో ముస్లిం దుకాణాలపై దాడులు జరిగాయి.దీంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ లో బీజేపీ మంచి పట్టు సాధించడానికి కారణం ఇలాంటి గొడవలు తరచూ జరుగుతూండటమే. ఇప్పుడు గిరిజన ప్రాంతాల నుంచి ముస్లింలను ఖాళీ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఈ ఘటనల్ని ప్రభుత్వ చేతకానితనంగా చెబుతోంది. హోంమంత్రి లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు . మెల్లగా జైనూరు ఘటన విషయం జాతీయ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఈ అంశం మరికొంత కాలం రాజకీయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.