సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతోన్న ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19నుంచి ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జెన్సీ వార్డు నుంచి గురువారం రాత్రి ఎయిమ్స్ లోని ఐసీయూకు తరలించినట్లు సమాచారం.
ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్య వర్గాలు వెల్లడించాయి. ఏచూరికి ఇటీవలే కాటరక్ట్ సర్జరీ అయిందని, అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు, ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఆగస్టు 31నే సీపీఐ(ఎం) పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఎయిమ్స్ లో ఏచూరి చికిత్స పొందుతున్నారని తెలిపింది. ‘‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.