జల్సా సినిమాలో తన కుమార్తె ఇలియానాకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా బ్రహ్మానందాన్ని పెడతాడు ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రకాష్ రాజ్. ఎందుకంటే ఆ ఐపీఎస్‌కు.. ఆ బ్రహ్మానందమే ఎన్ఎస్జీ రేంజ్లో కనిపించారు. అంటే చూసే కళ్లను బట్టే ఉంటుందన్నమాట. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి కూడ ాఅంతే. ఆయన తమ పార్టీ నేతలకు కోర్టు కేసుల్లో వాదించడానికి పొన్నవోలుసుధాకర్ రెడ్డికి బాధ్యతలిచ్చేశారు. అందు కోసం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చారు.
అంటే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో సమానం. పొన్నవోలు తాను.. తాన కుటుంబం అంతా ఫ్యాక్షనిస్టులమేనని ఆస్ట్రేలియాలో సిగ్గుపడుతూ సొంత పార్టీ నేతల ముందు గొప్పలు పోయారు. అది కూడా ప్లస్ అయిందేమో కానీ.. వైసీపీలో ఓ రేంజ్ లో ఉండాల్సిన అర్హత ఆయనకు ఉందని జగన్ తేల్చేసి పదవి ఇచ్చేశారు. నిన్నటిదాకా ఏఏజీగా పని చేసిన ఆయన ఇప్పుడు వైసీపీ లీడర్ గా మారిపోయారు. పదవిలో ఉన్నా ఆయన వైసీపీనేతగానే వ్యవహరించారు … నల్లకోటు పరువు తీశారని చాలా మంది విమర్శిచినా ఆయన తుడిచేసుకున్నారు.. అది వేరే విషయం.
అయితే పొన్నవోలు ఇప్పుడు ఉత్తినే ఆ పదవి ఇవ్వలేదు. అరెస్టయ్యే ప్రతి నాయకుడ్ని విడిపించాలి. కానీ ఆయన వాదిస్తే విడిపించే సంగతేమో కానీ వచ్చే బెయిల్ కూడా రాకుండా చేస్తారేమోనన్న భయం పార్టీ నేతలకు ఉంటుంది. అయినా జగన్ రెడ్డి పెడుతున్నారు కాబట్టి పొన్నవోలు సాయం తీసుకోవాల్సిందే. అసలే కేసులతో తంటాలు పడే వైసీపీ నేతలకు గుదిబండగా పొన్నవోలును జగన్ తగలించేస్తున్నారని వేదనకు గురవుతున్నారు.