నిమ్మల రామానాయుడు .. నిజమైన ప్రజా సేవకుడు అని ఆయన పనితీరును చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. పాలకొల్లులో ఆయన పీపుల్స్ ఎమ్మెల్యే. ప్రతి ఇంటి ముందు ఆయన ఉంటారు. రోజూ సైకిలేసుకుని తిరుగుతారు. సమస్య ఎక్కడ ఉన్నా హంగూ ఆర్భాటం లేకుండా వెళ్లివస్తారు. బ్యానర్లు.. స్వాగతాలు ఎక్కడా ఉండవు.కానీ కష్టాల్లో ఆయన ఉంటారు. అందుకే పాలకొల్లు అంటే రామానాయుడు.
ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు. ఆయన సేవలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమయ్యాయి. విజయవాడ వరదల్లో అందరితో పాటు ఆయన భిన్నమైన బాధ్యతలు తీసుకున్నారు. ముంపునకు కారణం అయిన బుడమేరు కట్టకు పడిన గండ్లను పూడ్చే బాధ్యతలు తీసుకున్నారు. మూడు రోజుల నుంచి ఆయన కట్టమీదే ఉంటున్నారు. తిండి, నిద్ర మొత్తం అక్కడే. తాత్కాలికంగా అయినా ఆ గండి పూడిస్తే.. భయం తొలగిపోతుంది. ఆ తర్వాత శాశ్వత చర్యలు తీసుకోవచ్చు. నిమ్మల అందుకే కష్టపడుతున్నారు.
నిమ్మల రామానాయుడులా కష్టపడితే… ఓ నియోజకవర్గంలో మరో ప్రజాప్రతినిధి వైపు ప్రజలు తిరిగి చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఎమ్మెల్యే అనే పదవి అనుభవించడానికి.. దోచుకోవడానికి కాదు. ప్రజల సమస్యలు తీర్చడానికి. ఈ విషయంలో నిమ్మల రామానాయుడు ప్రజలు ఇచ్చిన అవకాశంపై చాలా స్పష్టతతో ఉన్నారు. అందుకే ఇప్పుడు నిమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.