ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎప్పుడూ వుంటుంది. కాస్త అందం, అభినయం వున్న తారలకు అవకాశాలు వెదుక్కుంటూ వస్తుంటాయి. అయితే అవకాశాలు రావడం గొప్ప కాదు.. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. స్క్రీన్ పై ప్రామెసింగ్ కనిపించి, కొద్దిరోజుల్లోనే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ ఎందరో. క్రేజ్ వున్నప్పుడు వరుస సినిమాలు చేసేయాలనే ఉబలాటం ఒక కారణం అయితే, కథ, క్యారెక్టర్ కాకుండా ..కాంబినేషన్ చూసి సైన్ చేయడం మరో రీజన్.
హీరోయిన్ మీనాక్షి చౌదరి పరిస్థితి కూడా ఇలానే వుంది. మిస్ ఇండియా కిరీటం అందుకొని సినిమాల్లోకి అడుగుపెట్టింది మీనాక్షి. ఇచ్చట వాహనములు నడపరాదు అనే చిన్న సినిమాతోనే తెలుగులో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ నచ్చి రవితేజ ఖిలాడీ సినిమా అవకాశం వచ్చింది. తర్వాత బిగ్ లీగ్ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె ఎంచుకుంటున్న పాత్రలే బలహీనంగా ఉంటున్నాయి. మహేష్ బాబు తో చేసిన గుంటూరు కారంలో అయితే కరివేపాకు లాంటి క్యారెక్టర్. ఆ సినిమాలో మీనాక్షి చూసి చాలా మంది జాలి పడ్డారు.
గుంటూరు కారంలోనే వీక్ క్యారెక్టర్ అనుకుంటే తాజాగా వచ్చిన విజయ్ ‘గోట్’ లో అంతకుమించి అన్నట్టుగా వుంది. విజయ్ సినిమాలో కనిపించి ఓ పాటలో డ్యాన్స్ చేస్తే చాలు అనుకోని ఈ సినిమా ఒప్పుకుందేమో అనిపించింది. ఒక్క బలమైన సీన్, డైలాగ్ లేదు. పైగా ఆ పాత్ర ద్వారా వచ్చే అనవసరమైన హింస ఇంకాస్త ఇబ్బంది పెట్టింది. మీనాక్షికి క్రేజ్ వుంది. ఆఫర్లు కూడా వున్నాయి. వాటిని నిలబెట్టుకునేలా పాత్రల ఎంపిక వుండాలి. లేదంటే ఇప్పుడున్న రేసులో వెనకపడిపోయే ప్రమాదం వుంది.