మెగా హీరో సాయి దుర్గ్ తేజ్ కథానాయకుడిగా `హనుమాన్` ఫేమ్ టి.నిరంజన్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ కె.పి. దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్య లక్ష్మిని ఎంచుకొన్నారు. ఈ కథలో ఆమె వసంతగా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం చాలామంది తెలుగమ్మాయిల పేర్లు పరిశీలించిన చిత్రబృందం.. చివరికి ఐశ్వర్యని ఎంచుకొంది. ఈ రోజు ఐశ్వర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ”కథలో నాయికది చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర. నటనకు ఆస్కారం ఎక్కువ. అందుకే ఐశ్వర్యని ఎంచుకొన్నాం” అని చిత్రబృందం ప్రకటించింది.
‘విరూపాక్ష’ తరవాత సాయితేజ్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేజ్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 1947 నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ ఊరు చుట్టూ నడుస్తుంది. ‘సంబరాల ఏటి గట్టు’ అనే పేరు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో కొంత మేర షూటింగ్ సాగింది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు. దాదాపు రూ.120 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, అందులో 30 శాతం సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కే ఖర్చు పెడుతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.