ఊహించని విధంగా బలహీనపడుతున్న వైసీపీకి బలం పెంచాలంటూ పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ ను జగన్ నియమించారు. ఈ నియామకంతో వైసీపీలో ఎవరీయన అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
వైసీపీ అధికారం కోల్పోయాక కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం వరుసగా వైసీపీని వీడుతోంది. పార్టీని వీడాలనే ఆలోచనతోనున్న నేతలను బుజ్జగిస్తున్నా ఫలితం ఉండటం లేదు. మరో కొద్ది రోజుల్లో మరికొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతారంటూ ప్రచారం జరుగుతోంది. వరుస వలసలతో వైసీపీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని జగన్ అంచనా వేసినట్టు ఉన్నారు.
గడిచిన కొద్ది రోజులుగా వైసీపీ కోసం రాజకీయ వ్యూహకర్తను నియమించుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారన్న ప్రచారం జరిగింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు, ఐ ప్యాక్ టీమ్ కు చెందిన స్ట్రాటజిస్ట్ లతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలూ వినిపించాయి.
వీటిపై చర్చ జరుగుతుండగానే..పార్టీ నిర్మాణం కోసం ఆళ్ల మోహన్ సాయి దత్ ను జగన్ నియమించారు. ఈ సాయి దత్ ఎవరో కాదు.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి సేవలందించారు. రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది సీట్లు బీజేపీకి దక్కినా ఆయన పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయినా ఇప్పుడు ఆయన్నే పార్టీ కోసం జగన్ నియమించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
దేశంలో పేరుమోసిన వ్యూహకర్తలు నో చెప్పడంతోనే చివరాఖరుకు సాయి దత్ ను పార్టీ నిర్మాణం కోసం జగన్ తెచ్చి పెట్టుకున్నారా..? అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.