మోక్షజ్ఞ రూపంలో మరో నందమూరి నట వారసుడు నట ప్రయాణం ప్రారంభించాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా, ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చిత్రబృందం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. దాంతో అభిమానుల్లో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేసిన ట్వీట్లు… ఆ సంబరాల్ని డబుల్ చేశాయి. కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞని అభినందిస్తూ, తాతయ్య అశీస్సులు మెండుగా ఉండాలని, అభిమానుల అంచనాల్ని అందుకోవాలని ఆశీర్వదిస్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ కూ బాలయ్య కూ మధ్యన కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయం నందమూరి అభిమానులే ఒప్పుకొంటారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అటు ఎన్టీఆర్, ఇటు కల్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు. కనీసం బాబాయ్‌కు ట్విట్టర్ లో కూడా శుభాకాంక్షలు తెలియజేయలేదు. దాంతో ఎన్టీఆర్‌పై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మోక్షజ్ఞను అభినందిస్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వాతావరణాన్ని కాస్త కూల్ చేసినట్టు కనిపిస్తోంది. కల్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేసి, మోక్షజ్ఞకు అభినందనలు తెలియజేశారు. ఇదే ట్వీట్ బాలయ్యకు ఎందుకు చేయలేదన్నది ఫ్యాన్స్ లో వస్తున్న అనుమానం. నటుడిగా బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న శుభ సందర్భంగా ఒక్క ట్వీట్ చేసినా, ఇంత గోల ఉండేది కాదు. ఆ తప్పు చేయకూదనే మోక్షజ్ఞ విషయంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇలా జాగ్రత్త పడ్డారేమో..?!