మొన్నటి ఒలంపిక్స్ లో రెజ్లర్ వినీష్ ఫోగట్ కోసం స్పందించని వారంటూ లేరు. 100గ్రాముల బరువు అధికంగా ఉందని పోటీ నుండి తప్పించారు. రాత్రంతా బరువు తగ్గేందుకు తను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పతకం గెలవకున్నా… ప్రజల మనస్సు గెలుచుకున్నారు.
ఆటకు ఇప్పటికే గుడ్ బై చెప్పిన వినీష్… ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వచ్చే హర్యానా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. వినీష్ తో పాటు మరో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరుతున్నందున రైల్వేలో ఉన్న ఉద్యోగానికి వినీష్ రాజీనామా చేశారు.
అక్టోబర్ 5న హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇద్దరు రెజ్లర్లకు అసెంబ్లీ టికెట్లు దక్కబోతున్నాయి.
వినీష్ ఒలంపిక్స్ నుండి స్వదేశానికి వచ్చిన రోజే కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. దీంతో వినీష్ కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలవగా, ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ కోరినట్లు తెలిసింది. గతంలో వినీష్ సోదరి బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు.