ఇటీవల మీడియాలో బాగా నానిన పేరు రాజ్ తరుణ్. తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ లావణ్య మీడియాకు ఎక్కడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. లీకైన వీడియోలు, ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలతో చాలా హై డ్రామా నడిచింది. మీడియాకు కొంత కాలం ఇదే ఫుటేజీ. కొన్ని రోజుల పాటు ఇదే హాట్ టాపిక్. కల్యాణ్ దిలీప్ సుంకర లావణ్యవైపు, శేఖర్ బాషా రాజ్ తరుణ్ వైపు పోరాడారు. వాళ్లూ వాళ్లూ లైవ్ లో తిట్టుకొన్నారు కూడా. అయితే… సడన్‌గా ఈ వ్యవహారం చల్లబడిపోయింది. అటు రాజ్ తరుణ్ గానీ, ఇటు లావణ్య గానీ నోరు విప్పడం మానేశారు. దాంతో తెర వెనుక సెటిల్మెంట్ ఏమైనా జరిగిపోయిందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
అయితే ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోయింది. పోలీసులు సైలెంట్ గా తమ విచారణ దాదాపుగా పూర్తి చేసేశారు. లావణ్య, రాజ్ తరుణ్ పదేళ్లు కలిసే ఉన్నారని, లావణ్య చెప్పిన విషయాల్లో దాదాపుగా నిజాలు ఉన్నాయని పోలీసులు నిర్దారించినట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని సాక్షాధారాల్ని కోర్టుకు అప్పగించారని, తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారని తెలుస్తోంది. రాజ్ తరుణ్‌పై చార్జ్ షీట్ నమోదు చేశారని సమాచారం. ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకొన్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజ్ తరుణ్ తన కొత్త సినిమా విడుదల ప్రమోషన్లలో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఈనెల 13న రాజ్ తరుణ్ సినిమా ‘భలే ఉన్నాడే’ విడుదలకు సిద్ధమైంది. ఈలోగా ఈ కేసు మళ్లీ తన మెడకు చుట్టుకొంది.