తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని లైట్ తీసుకుంటుందా? ఉద్దేశపూర్వకంగానే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదా? పార్టీలో జరుగుతోన్న పరిణామలపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం ఏర్పాటు చేసిన బృందంలో తనను సభ్యుడుగా చేర్చడంపై ఏలేటి తన స్థాయిని తగ్గించినట్లుగా ఫీల్ అవుతున్నారు. మూడు రోజుల కిందట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు బీజేపీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఓ బృందానికి బండి సంజయ్ , మరో బృందానికి ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తారని అనౌన్స్ చేసింది. ఇదే ఏలేటి ఆగ్రహానికి కారణమైంది.
ఫ్లోర్ లీడర్ గా ఉన్న తనకు రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాలకు వెళ్లే నేతల బృందానికి నాయకత్వం వహించే బాధ్యతలు అప్పగించకుండా.. కేవలం ఆ బృందంలో సభ్యుడిగా చేర్చడం అవమానంగా ఫీల్ అవుతున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అందుకే వరద ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటనకు ఏలేటి దూరంగా ఉన్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది.
వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్ళే బృందానికి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ కు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చి… ఫ్లోర్ లీడర్ గా ఉన్న తనను సభ్యుడిగా చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉద్దేశపూర్వకంగానే ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి వర్గీయులు రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం – మహేశ్వర్ రెడ్డి మధ్య గ్యాప్ పెరుగుతోంది అని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.