అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. అయినా, మన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మీద కనికరం లేదు. సామాన్యుడికి గుదిబండల మారిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలన్న కనీస ఆలోచన కూడా చేయటం లేదు.
ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ పై పన్నుల శాతం అధికం. అందుకే దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకరాలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ రేట్లు పెరిగిన వెంటనే రేట్లు పెంచేసే ఆయిల్ కంపెనీలు, తగ్గినప్పుడు మాత్రం తగ్గించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయవు.
అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది దాదాపు 9నెలల కనిష్ట స్థాయి. అయినా రేట్లు ఏమాత్రం తగ్గించటం లేదు. గడిచిన పది సంవత్సరాల్లో పెట్రోల్ పై వంద శాతంకు పైగా ఎక్సైజ్ డ్యూటీ పెంచగా, డీజిల్ పై 300శాతంకు పైగా పెరిగింది. ఫలితంగా రేట్లు దాదాపు 30 రూపాయలకు పైగా పెరిగిపోయాయి. దీంతో సగటు వేతన జీవితో పాటు నిత్యవసరాల ధరలకు రెక్కలు వచ్చాయి.
అయితే, క్రూడాయిల్ ధరలు తగ్గటంతో ధరలను తగ్గించని ఆయిల్ కంపెనీలు… కొన్ని రోజులుగా పాత ధరలనే కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే, త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో, పెట్రోల్-డీజిల్ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.