నందమూరి కుటుంబ హీరోతో డీల్ చేయడం మామూలు విషయం కాదు. ఆ అంచనాల భారం మోయడం అంత సులభం కాదు. ఆ కుటుంబానికి ఉన్న చరిత్ర, అభిమానులు పెంచుకొన్న ఆశలు వాటితో డీలింగ్ అంటే ఓ యుద్ధం చేసినట్టే. నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉందో తెలీదు కానీ, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతకు వెయ్యి రెట్ల భారం దర్శకుడు మోయాల్సివస్తుంది.
ప్రశాంత్ వర్మపై ఇప్పుడు అలాంటి పెను భారమో పడింది. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు తానే దర్శకుడు. బోయపాటి శ్రీను, క్రిష్, అనిల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు పరిశీలించిన తరవాత.. ఆ ఛాన్స్ ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టేశాడు బాలయ్య. అయితే ప్రశాంత్ వర్మ తక్కువ వాడేం కాదు. తన ఖాతాలో ‘హనుమాన్’ లాంటి సినిమా ఉంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి, సంచలనాలు నమోదు చేసిన సినిమా అది. ప్రశాంత్ వర్మ ఆలోచనలు ఎంత విభిన్నంగా ఉంటాయో ‘ఆ’ అనే సినిమానే చెప్పకనే చెప్పింది. అవుటాఫ్ ది బాక్స్ ఐడియాకు కమర్షియాలిటీ అద్ది వడ్డించగలిగే సమర్థుడు ప్రశాంత్ వర్మ. ఈసారి కూడా కచ్చితంగా అలాంటి పాయింట్ తో వస్తున్నాడన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు అనగానే అభిమానులు ఏం కంగారు పడలేదు. ఓరకంగా తమ హీరో సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడన్న భరోసా పెంచుకొన్నారు. ఇవన్నీ ప్రశాంత్ వర్మ మోయాల్సిన అదనపు భారాలు.
రామ్ చరణ్ ఎంట్రీ సినిమా పూరి చేతుల్లో పెట్టాడు చిరు. అప్పటికి పూరి ‘పోకిరి’ లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తీసి ఉన్నాడు. మాస్ సినిమాల్ని డీల్ చేయడం అతనికి కొత్తేం కాదు. మహేష్ బాబుని రాఘవేంద్రరావుకు అప్పగించారు కృష్ణ. రాఘవేంద్రరావు ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్‌ని డీల్ చేసిన పూరి గానీ, మహేష్ తో అరంగేట్రం చేయించిన రాఘవేంద్రరావు కానీ.. అనుభవశీలురు. కానీ ప్రశాంత్ వర్మకు ఇది 4వ సినిమా. పైగా ఈ సినిమాలోనే ఆయన నందమూరి బాలకృష్ణని చూపించే సాహసం చేస్తున్నారు. అది ఇంకో బ్యాగేజీ. అన్నింటికంటే ముఖ్యంగా కమర్షియల్ కథకు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నాడు వర్మ. ఇలా… ఒకే సినిమాలో ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడం సాహసమే. కానీ ప్రశాంత్ వర్మకు తాను ఏం చేయబోతున్నాడన్న విషయంలో క్లారిటీ ఉంది. ‘హనుమాన్’ తరవాత తనలో ఒకరకమైన కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. అది… మోక్షజ్ఞకు ప్లస్. మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా, నందమూరి అభిమానుల అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని, మోక్షజ్ఞ బలాల్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే – ప్రశాంత్ వర్మ ఈ మిషన్‌ని దిగ్విజయంగా పూర్తి చేయగలడు. ఏది ఏమైనా, ప్రశాంత్ వర్మ కెరీర్లో ఇది ఓ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇక్కడ సక్సెస్ కొడితే గనుక… తను బిగ్ లీగ్ లో చేరిపోవడం ఖాయం.