ఉవ్వెత్తున లేచి, పడిన కెరటం శ్రీలీల. వచ్చిన కొత్తలో ఝామ్ ఝామ్ అంటూ సినిమాలు చేసేసింది. అందం, అభినయంతో పాటు డాన్సింగ్ టాలెంట్ కూడా ఉండడం శ్రీలీలకు కలిసొచ్చింది. ఏ హీరో సినిమా చూసినా… అందులో హీరోయిన్ శ్రీలీలే. అయితే… వరుస ఫ్లాపులతో శ్రీలీల కెరీర్ కు సడన్ బ్రేకులు పడ్డాయి. పైగా శ్రీలీల క్యారెక్టర్లన్నీ ఒకే మూసలో కొట్టుకుపోవడం వల్ల తన కెరీర్ ని మరింత ఇబ్బందికి గురి చేసింది. అందుకే కాస్త బ్రేక్ తీసుకొంది. ఎలాంటి కథలు ఎంచుకోవాలో ఆలోచించుకోవడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికీ ఈ బ్రేక్ ఆమెకు చాలా ఉపయోగపడుతుంది. ఈమధ్య కొన్ని ఆఫర్లు కూడా వెనక్కి పంపేసింది. అందులో విజయ్ సినిమా కూడా ఉంది. ‘గోట్లో’ త్రిష ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఆఫర్ ముందుగా శ్రీలీల దగ్గరకు వచ్చింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ పక్కన చిందులు వేయాలని ప్రతీ హీరోయిన్ కోరుకుంటుంది. ఆ అవకాశం కెరీర్ ఆరంభంలోనే వస్తే..అంతకంటే కావల్సింది ఏముంది? అయితే శ్రీలీల మాత్రం వేరేలా ఆలోచించింది. అప్పటికే వరుస పరాజయాలతో అల్లాడుతున్న శ్రీలీల.. ఐటెమ్ గాళ్ అనగానే ఆలోచనలో పడింది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఐటెమ్ గాళ్ గా కనిపిస్తే, తనపై ఆ ముద్రే పడిపోతుందని, ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి ఐటెమ్ గాళ్ గా సెటిల్ అయిపోయిందన్న విమర్శలు వస్తాయని శ్రీలీల గ్రహించింది. అందుకే పారితోషికం ఎంత ఇస్తామన్నా శ్రీలీల ఒప్పుకోలేదు. చివరికి అది త్రిష దగ్గరకు వెళ్లింది. ‘గోట్లో’ త్రిష కనిపించడం విజయ్ అభిమానులకు షాకే. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ ఐటెమ్ పాట కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ ఛాన్స్ వదులుకోవడం శ్రీలీల తీసుకొన్న మంచి నిర్ణయాల్లో ఒకటి. ఎందుకంటే ‘గోట్’ రూపంలో తన ఖాతాలో మరో ఫ్లాప్ చేరేది. అన్నట్టు చిరంజీవి ‘విశ్వంభర’లో శ్రీలీలకు ఓ పాటలో నర్తించే అవకాశం వచ్చింది. దాన్ని కూడా శ్రీలీల వదలుకొంది.